డ్రోన్లు ఏం చేస్తాయి..
అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ).. వీటినే డ్రోన్లు అని పిలుస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలకు డ్రోన్లను విరివిగా వాడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో మందుల పంపిణీకి వినియోగిస్తున్నారు. విందు వినోదాల సమయాల్లో వీడియోలు తీయడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. అయితే డ్రోన్ టెక్నాలజీని పాకిస్తాన్ ఇష్టారాజ్యంగా వినియోగిస్తోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా, యూకే, ఇజ్రాయెల్ తర్వాత మిలటరీ డ్రోన్లను పాకిస్తానే ఎక్కువగా వాడుతోంది.
Drones
డ్రోన్ దాడుల్ని ఎదుర్కోవటం ఎలా..?
డ్రోన్ దాడులతో యాంటీ డ్రోన్ టెక్నాలజీపై మళ్లీ చర్చ మొదలయ్యింది. ఈ టెక్నాలజీలో భారత్ బాగా వెనుకబడింది. మన గగనతలంలోకి ప్రవేశించే డ్రోన్లను రాడార్లు గుర్తించలేకపోతున్నాయి. రాడార్లతో డ్రోన్లను గుర్తించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. థర్మల్ కెమెరాల సాయంతో డ్రోన్లతో గుర్తిస్తున్నా అప్పటికే సమయం మించిపోవడంతో ముప్పును నివారించడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం డ్రోన్లను ఎదుర్కోవడానికి సాఫ్ట్‌కిల్, హార్డ్ కిల్ అనే రెండు రకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ కిల్ టెక్నాలజీతో డ్రోన్లను ముందుగానే అడ్డుకోవచ్చు. మన గగనతలంలో ప్రవేశించకుండానే అడ్డుకొని వాటి వ్యవస్థని ఫ్రీజ్ చేయవచ్చు. హార్డ్‌కిల్ టెక్నాలజీతో డ్రోన్లను కూల్చేయవచ్చు. రెండేళ్లుగా సాఫ్ట్ కిల్ టెక్నాలజీని భారత్ వాడుతోంది. ఇప్పుడు హార్డ్‌కిల్ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించింది. మన దేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) సొంతంగా యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేసింది. 2020లో ఎర్రకోట వద్ద మన డ్రోన్ల టెక్నాలజీ వినియోగించారు. ఈ వ్యవస్థ కేవలం 2 నుంచి 3 కి.మీ. పరిధిలోకి వచ్చాకే డ్రోన్లను గుర్తించగలదు. ఇజ్రాయెల్‌కి చెందిన స్మార్ట్ షూట్ సంస్థతో యాంటీ డ్రోన్ వ్యవస్థ కొనుగోలుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. డ్రోన్లు కొనుగోలుపై కాకుండా, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తే మంచిదనే వాదన వినిపిస్తోంది.
ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయంటే…?
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు వినియోగంలో ఉన్నట్లు అమెరికాకి చెందిన బార్డ్ కాలేజీ సెంటర్ ఫర్ స్టడీ ఆన్ డ్రోన్స్ అంచనా వేసింది. పదేళ్ల క్రితం 60 దేశాల్లో మిలటరీ డ్రోన్లు వినియోగంలో ఉండగా..ఇప్పుడు 95 దేశాల్లో మిలిటరీ డ్రోన్లు వినియోగిస్తున్నారు. యుద్ధానికి వినియోగించే డ్రోన్లు ప్రస్తుతం 171 రకాలు ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్, యూకే, రష్యా, టర్కీ వంటి దేశాల తర్వాత పాకిస్తాన్లో ఎక్కువగా మిలటరీ డ్రోన్ల వినియోగిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాక్ వాడుతోంది. ఇతర దేశాలకు డ్రోన్లను ఇజ్రాయెల్ అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రిటన్, భారత్ సహా పలు దేశాలకు గత ఎనిమిదేళ్లలో 460 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లు ఎగుమతి చేసింది.
భవిష్యత్తులో యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం భారీగా పెరిగే అవకాశముంది. తక్కువ ఖర్చుతో కూడుకున్న డ్రోన్లను శత్రుదేశాలతో పాటు ఉగ్రవాదులు కూడా సమకూర్చుకునే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్రోన్లతో పాటు.. శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసే యాంటీ డ్రోన్ టెక్నాలజీపై కూడా భారత్ దృష్టిసారించాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
-Research Dept, TV9 Telugu
Also Read..
OnePlus TV: వినియోగదారులకు షాకింగ్.. భారీగా పెరిగిన స్మార్ట్‌టీవీల ధరలు..రూ.7000 వరకు పెంపు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు