శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌తో పాటు నాంపలి, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ రైల్వేస్టేషన్ల నుంచి శబరిమల వెళ్తాయి. అయితే రైళ్లలో వెళ్లే ప్రయాణికుల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు సూచనలు చేశారు.
ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తారు. అయితే దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. రైళ్లలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి పుల్లలు వెలించడం లాంటివి చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించింది దక్షిణమధ్య రైల్వే. మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణం చేయకూడదన్నారు. ఇలాంటి వాటిని నిషేధించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మండే స్వభావం ఉన్న పదార్థాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి వాటి వల్ల రైల్వే ఆస్తులకు నష్టం కగిలించడంతో పాటు ప్రయాణికులకు కూడా ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైల్వే అధికారులు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 67, 154, 164, 165 ప్రకారం ఇది నేరం అంటున్నారు. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే బాధ్యులకు 3 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రైల్లో పూజలు చేయడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇకపై జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. శబరిమలకు వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలంటున్నారు రైల్వే అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.