
ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌బస్ జర్నీ కూడా ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ఎడాపెడా క్యాన్సిలేషన్లు.. రీషెడ్యూళ్లు.. డిలేలు.. చెకిన్ టైమ్‌కంటే ముందే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినా కూడా ఫ్లైట్ బయలుదేరుతుందో లేదో తెలియని గందరగోళం.. ముఖ్యంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అయితే కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తోంది. “ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అంతరాయానికి చింతిస్తున్నాం” అంటూ ఒక చిన్న అడ్వైజరీ పడేస్తే వాళ్ల పని అయిపోయినట్టా..! ఇదే అంతా ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధనలతో సిబ్బంది కొరత ఏర్పడి ఈ గందరగోళానికి దారితీసిందంటున్నారు. గత నెలలో ప్రవేశపెట్టిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల ప్రకారం.. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి సమయం ఇవ్వాలి. దీనికి అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను మార్చుకోవడంలో ఇండిగో సంస్థ ఇబ్బంది పడుతోంది. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొన్ని విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఎనిమిది గంటలపైగా ఆలస్యమవుతున్నాయి. దేశీయ విమానయాన మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో షెడ్యూల్‌లో అంతరాయం కారణంగా మొత్తం వ్యవస్థపై ప్రభావం పడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 35 శాతానికి పడిపోయాయి ఇండిగో సర్వీసులు.
ఇండిగో విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంతరాయానికి ఇండిగో క్షమాపణలు చెబుతూ, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అంతేకాదు, రద్దయిన విమానాల్లో టిక్కెట్లకు రీఫండ్‌లు అందిస్తున్నామని, విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రస్తుత విమాన స్థితిని చూసుకోవాలని కోరింది. అయితే ఇండిగో వల్ల ఇబ్బంది పడ్డ ప్రయాణికులైతే సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముందే ఫిక్సైన షెడ్యూల్ అన్నీ డిస్ట్రబ్ అవడంతో కొందరు.. కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్సైన వాళ్లు కొందరు.. ఇంటర్నేషనల్ జర్నీకి ఇబ్బందులు తలెత్తిన వాళ్లు ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా ఇబ్బంది. ఒక్కో చోటా ఎయిర్‌పోర్ట్‌లో 30 నుంచి 40 ఫ్లైట్లు రద్దవడంతో వందల మంది ఎయిర్‌పోర్టుల్లో తమ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రత్యమ్నాయాలు వెతుక్కోవాలన్నా ఆఖరు నిమిషంలో సాధ్యం కాక వెనక్కి తిరిగి వెళ్లాల్సిన వాళ్ల కోపమైతే మామూలుగా లేదు.