Prashant Kishor hot comments: రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే థర్డ్ ఫ్రంట్ అనేది వర్కవుట్ కాదు అని పీకే స్పష్టం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్‌కు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే 15 రోజుల వ్యవధిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను రెండుసార్లు కలిశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
ప్రముఖ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కొత్తగా ఏర్పడే ఫ్రంట్‌లతో ప్రస్తుత ప్రభుత్వాన్ని వచ్చే ఇబ్బంది ఏమిలేదన్నారు. థర్డ్, ఫోర్త్ ఫ్రంట్‌లు మోదీ సర్కార్‌ను దించేలా ఎదుగుతాయని నేను అనుకోవడం లేదు అని అన్నారు. మూడో ఫ్రంట్ ఇప్పటికే ప్రయత్నించారు.. ఇది పాత మోడల్.. ఇప్పటి రాజకీయ పరిస్థితులకు ఇది సరిపోదు అని పీకే స్పష్టం చేయడం గమనార్హం.
ఎన్సీపీ అధినేత పవార్‌తో సోమవారం మరోసారి భేటీ అయిన పీకే.. ప్రతిపక్షాల సమావేశానికి పిలుపునిచ్చిన రోజే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం పవార్‌తో మూడు, నాలుగు గంటల పాటు ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కులంకశంగా చర్చించారు. అయితే, తామిద్దరం ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికే ఇలా కలుస్తున్నామని పీకే చెప్పారు. గతంలో ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి పని చేయలేదు. బీజేపీపై పోరులో ఏది పని చేస్తుంది.. ఏది చేయదు.. ఏ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి అన్న అంశాలపై వీళ్లు చర్చించినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే.. బీజేపీకి ధీటుగా నిలిచే సత్తా మీకూ ఉన్నదంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాగానే తాను ఈ ఎన్నికల వ్యూహకర్త పనికి ఇక గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. అప్పుడే పవార్‌తో సమావేశాలు, ప్రతిపక్షాల భేటీకి పిలుపులు ఇస్తుండటం గమనార్హం.