పంజాబ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పార్టీ ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకుని ఏడో కార్పొరేషన్ లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో భటిండా,హోషియార్ పూర్, అబోహర్, బటాలా, పఠాన్ కోట్ లను కైవసం చేసుకుంది. మోగాలో పెద్ద పార్టీగా ఏర్పడింది. ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా మోదీ ప్రభుత్వం రైతు చట్టాలను ఇంకా పాపులర్ చట్టాలుగా భావిస్తోందా అని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. రైతులు, వలస కార్మికులు, నిరుద్యోగులు, పేద కుటుంబాలే ఓటర్లని, వారి వంతు వచ్చినప్పుడు పంజాబ్ ఓటర్ల మాదిరే వారు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాలను పంజాబ్ లో కేవలం కొద్దిమంది రైతులే వ్యతిరేకిస్తున్నారని మోదీ సర్కార్ భావిస్తే అది పొరబాటే అవుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ సర్కార్ మేల్కొనాలని ఆయన సూచించారు.
ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా..ఈ ఫలితాలు బీజేపీకి, మోదీ ప్రభుత్వానికి దీటైన సమాధానం ఇఛ్చాయని ట్వీట్ చేశారు. పంజాబ్ శాపం, బీజేపీ పతనం అని ఆయన వెరైటీగా వ్యాఖ్యానించారు.
Also Read:
మమతను ఢీ కొనేందుకు సినీ, టీవీ యాక్టర్లను చేర్చుకుంటున్న బీజేపీ, ఎన్నికల ముందు భలే ఎత్తుగడ