ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా డ్రెస్ కోడ్ ను మరో పుణ్యక్షేత్రంలో అమలు చేయనున్నామని ప్రకటించారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒడిశాలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరికీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆలయానికి వచ్చే భక్తులు డ్రెస్ కోడ్ ను అనుసరించి దుస్తులు ధరించాలని.. అటువంటి భక్తులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించే వీలు ఉంది. ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించనున్నారు.
జగన్నాథ ఆలయ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంతో జనవరి 1 నుండి ఆలయంలో పొట్టి దుస్తులు, చిరిగిన జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ వంటి దుస్తులు ధరించిన భక్తులు ఆలయంలో ప్రవేశించడం నిషేధం. భక్తులు ఇక నుంచి అటువంటి దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించలేరు. అయితే ఆలయంలో ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నామని జగన్నాథ ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
జగన్నాథ ఆలయ నిర్వహణ చీఫ్ రంజన్ కుమార్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. భక్తులు తరచూ పొట్టి బట్టలు ధరించి దర్శనం కోసం ఆలయానికి వస్తున్నారని ఈ నేపథ్యంలో ఆలయ పాలసీ సబ్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి ఆలయ కమిటీ సూచించిన దుస్తులను ధరించిన వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉండనున్నట్లు వెల్లడించారు.
ఆలయంలో దేవుడు నివసిస్తాడనీ.. పవిత్ర స్థలం.. అంతేకాని ఆలయం వినోదం ఇచ్చే స్థలం కాదని నిర్వాహణాధికారి చెప్పారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు ఏదో పార్కులోనో, బీచ్‌లోనో వాకింగ్‌కు వెళ్తున్నట్లు పొట్టి దుస్తులు, చిరిగిన దుస్తులు ధరించి వస్తున్నారని.. అది పూర్తిగా తప్పు. అటువంటి పరిస్థితిలో ఇతరుల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.
ఆలయ గౌరవాన్ని పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని జగన్నాథ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. దీని కోసం జనవరి 1, 2024 నుండి డ్రెస్ కోడ్ ఖచ్చితంగా అమలు చేస్తామని.. దీనిని ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు అనుసారించాలని చెప్పారు. ఈ బాధ్యతను ఆలయ ద్వారం వద్ద నియమించబడిన భద్రతా సిబ్బంది, ఆలయం లోపల ఉన్న సేవకులకు అప్పగించారు. వీరంతా ఆలయానికి వచ్చే భక్తులపై నిఘా ఉంచనున్నారు.
అయితే ఆలయంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తుంది పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి మాత్రమే కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోకి అనేక పుణ్య క్షేత్రాల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళీ ఆలయ గర్భగుడిలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయబడుతోంది. అంతేకాదు ఉత్తరాఖండ్‌లోని 3 దేవాలయాలలో డ్రెస్ కోడ్ వర్తిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..