
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల పంపిణీ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ.. రాష్ట్రంలో నీటి ఎద్దడి, పంటల పరిస్థితిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖను రాశారు. బెంగళూరులో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన దేవగౌడ.. ఓ సందర్భంలో తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి నీటి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఓ నిపుణుల బృందాన్ని వెంటనే పంపించాలని కేంద్రాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. కేవలం రాజకీయాల కోసమో, అధికారం కోసమో నేను బతకడం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రజలను రక్షించేందుకే ఉన్నామని తెలిపారు. మా పార్టీ కూడా అందుకే ఉందని దేవగౌడ భావోద్వేగంతో పేర్కొన్నారు. ఇక్కడి కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి నీటిని విడుదల చేయడాన్ని తప్పుపట్టినటువంటి దేవగౌడ.. రాష్ట్రంలో అధికార ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు. కావేరి జలాల పంపిణీ విషయంలో కూడా కర్ణాటక, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలకు అసలు సంబంధం లేకుండా బయట ఏజెన్సీని ఏర్పాటు చేసేలా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అయితే ఇదిలా ఉండగా.. కావేరి జలాలను విడుదల చేసే విషయంలో.. ఇటు కర్ణాటకతో సహా.. తమిళనాడులో కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే తమిళనాడు నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటకలోని రైతుల సంఘాలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
ఇదిలా ఉండగా.. మొన్నటివరకు మండ్యకే.. పరిమితమైనటువంటి ఆందోళనలు ఇప్పుడు తాజాగా రాష్ట్రమంతటా కూడా విస్తరించాయి. అయితే కావేరి బేసిన్‌లో ఈ సీజన్ సరైన వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్లన్నీ కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని.. కర్ణాటక ప్రజలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే సెప్టెంబర్ 26వ తేదిన బెంగళూరు బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. మరోవైపు చూసుకుంటే.. తమకు అవసరమైన నీటిని విడుదల చేసి తమ పంటలను రక్షించాలని అటు తమిళనాడు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి జలాల విషయంలో ఇలా ఎప్పటినుంచో వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఈ అంశం కొలిక్కి రాలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..