
Dense Fog Engulfs Delhi: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఢిల్లీలో భారీగా పొగమంచు కురుస్తుంది. దీంతో కొద్ది దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నుంచి చలి తీవ్రత తగ్గుముఖం పట్టె అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము ఉందని తెలిపారు. పొగమంచు తో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఉదయం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే, ఫిల్మ్ సిటీ రోడ్, ఎలివేటెడ్ రోడ్‌తో సహా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.6 డిగ్రీలు కాగా, గరిష్ఠంగా 19.1 డిగ్రీలు నమోదైంది. పొగమంచు కారణంగా పెద్ద సంఖ్యలో విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. సుమారు 20 విమానాలు రద్దు చేయగా.. 150 వరకు ఆలస్యమయ్యాయి. పలు రైళ్ల తో పాటు రాంచీ, లేహ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, కోల్‌కతా విమాన రాకపోకలపై ప్రభావం చూపింది.