జాతీయ భద్రతా చట్టం కింద ఎవరినైనా అరెస్టు చేయవచ్చునని ఢిల్లీ పోలీసులకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారాలు ఇచ్చారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 19 నుంచి ఇది అమలులోకి వచ్చినట్టు భావించాలని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తారని అనుమానం వచ్చిన ఏ వ్యక్తినైనా వారు ఈ చట్టం కింద అరెస్టు చేయవచ్చునని బైజాల్ వెల్లడించారు. వివాదాస్పద రైతు చట్టాలు మూడింటిని కేంద్రం రద్దు చేయాలంటూ వేలాది అన్నదాతలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఆగస్టు 13 వరకు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద నిరసన ప్రదర్శనలు చేయాలని రైతు సంఘాలు ఇదివరకే పిలుపునిచ్చాయి. జంతర్ మంతర్ ప్రాంతమంతా ఇప్పటికే రైతులతో నిండిపోయింది.
అయితే లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్ వంటిది కొత్తదేమీ కాదని, ఈ విధమైన నిర్ణయాలను ఇదివరకు కూడా తీసుకున్నారని ఢిల్లీ పోలీసులు పెదవి విరిచారు. సాధారణంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వంటి జాతీయ పర్వ దినాల ముందు కూడా ఈ విధమైన ఉత్తర్వులను ఇస్తుంటారని వారన్నారు. ఇప్పటికే దేశద్రోహం కింద అరెస్టులపై సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఈవిధమైన చట్టాలు అవసరమా అని సర్కార్ ని కోర్టు నిలదీసింది. అందువల్ల ఈ చట్టం విషయం కూడా చర్చనీయాంశం కావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఆగస్టు 15 న దేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న దృష్ట్యా లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.