Threatens to Pm Modi: జైలుకు వెళ్లాలని కోరికతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్ట్ చేయాలని వేడుకోవడం సినిమాల్లోనే చూశాం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే నిజంగా జరిగింది. అయితే, అతను అరెస్ట్ కావడం కోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలే ప్రధాని వ్యవహారం.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సదరు వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే బెయిల్‌పై బయట తిరుగుతున్న వ్యక్తి.. మళ్లీ జైలుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఏం చేయాలా? అని ఆలోచించి ఏకంగా ప్రధాని మోదీకే గురి పెట్టాడు. ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ప్రధాని నరేంద్ర మోదీ చంపేయాలనుకుంటున్నాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
మొదట పిచ్చోడు అనుకున్నా.. ప్రధాని అంశం కాబట్టి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్ కాల్ ట్రేస్ చేసి నిందితుడిని గుర్తించారు. ఢిల్లీలోని ఖాజురిఖాస్‌లో నివాసం ఉంటున్న సల్మాన్(22)గా గుర్తించిన పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. జైలుకు తరలించారు. అయితే, ప్రధాని మోదీని చంపేస్తానంటూ కాల్ చేయడంపై పోలీసులు విచారించగా.. దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పాడు సల్మాన్. తాను బెయిల్‌పై బయటకు వచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తన కోరికను పోలీసులకు వెల్లడించాడు. మోదీ పేరుతో బెదిరింపులకు పాల్పడితే అరెస్ట్ చేస్తారని భావించి అలా ఫోన్ చేశానని చెప్పుకొచ్చాడు.
కాగా, సల్మాన్‌పై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిపారు. అతను తిరిగి జైలుకు వెళ్లాలని భావించాడని, అందుకే కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉండటం.. ప్రధాని మోదీ వ్యవహారం కాబట్టి సల్మాన్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు కూడా విచారిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.
Also read: