సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని.. రైతులను ఇబ్బందులకు గురి చేశారని సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ తో కలిసి సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేను కూడా రైతు ఉద్యమంలో పాల్గొన్నా. నా విషయంలో కూడా అచ్చు ఇలాగే జరిగింది. నన్ను కూడా స్టేడియంలో నిర్బంధించారు. కొన్ని రోజుల పాటు నేను కూడా స్టేడియంలోనే వున్నాను. రైతు ఉద్యమాన్ని అణచేయడానికి ఇదో రకమైన ఎత్తుగడ అని నాకు అప్పుడే అర్థమైంది అని కేజ్రీవాల్ వివరించారు.
రైతు ఉద్యమం కేవలం స్టేడియాలకు మాత్రమే పరిమితమైందన్న వాదనలు కూడా అప్పట్లో వచ్చాయని, వాటిని నిర్ద్వద్వంగా తోసిపుచ్చానని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. స్టేడియాలను జైళ్లగా మార్చనీయమని, దానిని అడ్డుకొని తీరుతామని చెప్పామన్నారు. ఆ సమయంలో చాలా కోపం వచ్చిందని, రైతులకు అండగా నిలిచామని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు.
ఇదిలావుంటే.. చండీఘడ్ పర్యటనలో బీజేపీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పొలాల్లో కరెంట్ మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందని విమర్శించారు ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల అయినప్పటికి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు కేసీఆర్. రైతులకు మేలు చేయాలని ఎవరైనా సీఎం ప్రయత్నిస్తే కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్ రైతులకు బీజేపీ దేశద్రోహులుగా , ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించిందన్నారు కేసీఆర్. రైతుల ఉద్యమం యూపీ , పంజాబ్ , హర్యానా , ఢిల్లీ రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా విస్తరించాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు కేసీఆర్.