
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలతో 100 పైగా విమానాల రాకపోకలు ప్రభావితం అయ్యాయి.. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) లో గురువారం (నవంబర్ 6) సాయంత్రం నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల ఉదయం నాటికి 100కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. విమానాలు రన్‌వేలో పై ఎక్కువసేపు ఎదురుచూస్తున్నాయి.
దీంతో ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ATC వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) లో సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తింది. ఇది ఆటో ట్రాక్ సిస్టమ్ ను ప్రభావితం చేసి, విమానాల షెడ్యూల్స్ ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ నుండి బయలుదేరే విమానాలు సగటున 50 నిమిషాలు ఆలస్యం అవుతున్నాయి. దీనివల్ల రావాల్సిన విమానాలు కూడా ప్రభావితమవుతున్నాయి.
ట్రావెల్ అడ్వైజరీ జారీ
ఢిల్లీ విమానాశ్రయంలో విమాన ప్రయాణాలకు ఆలస్యం కావడంతో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ATC సమస్య వల్ల అన్ని ఎయిర్‌లైన్స్ విమానాలు ఆలస్యమవుతున్నాయని ఎయిర్‌పోర్ట్, విమానంలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ATC సాంకేతిక సమస్యల వల్ల ఢిల్లీ బయలుదేరాల్సిన రావాల్సిన విమానాలు ప్రభావితమవుతున్నాయని ప్రయాణికులు తమ షెడ్యూల్ చెక్ చేసుకోవాలని స్పైస్ జెట్ సూచించింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విమాన రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని ఇండిగో పేర్కొంది
సాంకేతిక సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం
ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యను పరిష్కరించడానికి టెక్నికల్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. శుక్రవారం (నవంబర్ 7) సాయంత్రం కల్లా సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రయాణికులు తమ ఎయిర్‌లైన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో విమాన స్థితిని చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని అధికారులు భరోసా ఇచ్చారు.
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA), భారతదేశంలోని అత్యంత బిజీ ఎయిర్‌పోర్టులలో ఒకటి. ప్రపంచ ర్యాంకింగ్ లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు 9వ స్థానంలో ఉంది. ఢిల్లీ విమానాశ్రయం రోజుకు 1500 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక రోజుకు సగటున 2.2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.. ఏడాదికి సుమారు 8 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.. ATC సాంకేతిక సమస్యలతో ఢిల్లీ విమాన ఆలస్యాల ప్రభావం ఉత్తర భారత దేశంలోని ఇతర రాష్ట్రాల పైనా పడింది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..