Delhi Air Pollution: ఒక్క రోజు ఆనందం.. పది రోజుల నరకం.. దివాళి తర్వాత ఢిల్లీలో ఇదీ పరిస్థితి

ఒక్క రోజు ఆనందం.. పది రోజుల బాధగా మారింది. ఒకే ఒక్క రోజు టపాసుల మోత మోగించినందుకు. కాలుష్యం వాతతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాయు కాలుష్యం ధాటికి ఊపిరి పీల్చుకోలేక ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక కాలుష్యానికి కారణం మీరంటే మీరని అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్‌ ఆరోపణలు సంధించుకుంటున్నాయి.

Delhi Air Pollution: ఒక్క రోజు ఆనందం.. పది రోజుల నరకం.. దివాళి తర్వాత ఢిల్లీలో ఇదీ పరిస్థితి
Delhi Air Pollution

Updated on: Oct 21, 2025 | 11:11 PM

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. వాయు కాలుష్యం రెడ్ జోన్‌ను తాకింది. దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలకు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వాయు కాలుష్యంతో ఊపిరి ఆడక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని 38 ఎయిర్‌ మానిటరింగ్‌స్టేషన్లలో 36 రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. వజీర్‌పూర్‌లో ఏక్యూఐ 435గా నమోదవగా, ద్వారకా 422, అశోక్‌ విహార్‌ 445, ఆనంద్‌ విహార్‌ 440 పాయింట్లుగా నమోయింది. దీంతో ఈ ప్రాంతాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. బాణాసంచా మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుండి కాలుష్యం లేదని అర్థం. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ చెబుతోంది.

పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. దీంతో కాలుష్య నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోనుంది ఢిల్లీ సర్కార్‌. వాయు కాలుష్యాన్ని పరిష్కరించేందుకు గ్రాప్‌-2ను అమలు చేస్తోంది.

ఇక ఢిల్లీ కాలుష్యంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాలుష్యం పెరగడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆప్ ఆరోపిస్తే.. ఢిల్లీలో కాలుష్యానికి గతంలో అధికారంలో ఉన్న ఆప్‌ నిర్వాకమే కారణమని BJP కౌంటర్‌ ఇచ్చింది. గతేడాదితో పోలిస్తే 11 పాయింట్లు మాత్రమే వాయు కాలుష్యం పెరిగిందన్నారు మంత్రి మంజిందర్‌సింగ్‌ సిర్సా. కాలుష్యాన్ని నియంత్రించడంలో గత ఆప్‌ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు కాలుష్యానికి దీపావళి కారణమనడం సరికాదన్నారు బీజేపీ నేత.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.