A daily wager gets IT notice of Rs 37.5 lakh: అతనో దినసరి కూలీ. రెక్కాడితేగానీ డొక్కాడని సామాన్యుడికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందింది. అది చూసిన సదరు కూలీకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. రోజుకు రూ.500లు సంపాదించుకుంటూ బతుకీడిస్తున్న కూలీకి ఏకంగా లక్షల రూపాయలు పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ పేరిట అందిన నోటీసులు స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే..దినసరి కూలీగా పనిచేసుకొంటున్న ఓ వ్యక్తికి రూ.37.5 లక్షల బకాయిలు చెల్లించాలంటూ ఐటీ శాఖ పేరిట నోటీసులు రావడం కలకలం రేపింది.
బిహార్‌లోని ఖగారియా జిల్లా మఘౌనా గ్రామానికి చెందిన గిరీశ్ యాదవ్ దొరికిన పనులు చేసుకుంటూ రోజుకు రూ.500 సంపాదనతో ఎలాగోలా బతికేస్తున్నాడు. ఐతే ఇటీవల గిరీశ్‌కు రూ.37.5లక్షల బకాయిలు చెల్లించాలంటూ ఐటీ నోటీసులు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఏం చెయ్యాలోపాలుపోని గిరీశ్ పోలీసులను ఆశ్రయించి తన గోడు విన్నవించుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఈ కేసులో ఏదో మోసం ఉన్నట్లు పోలీసులకు అనుమానం కలిగింది. గిరీశ్ పేరుతో పాన్ నంబర్‌పై సదరు నోటీసులు వచ్చాయి. నోటీసుల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. గిరీశ్ యాదవ్‌కు రాజస్థాన్‌లో ఓ కంపెనీతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నాయి. నిజానికి గిరీశ్ మునుపెన్నాడూ ఆ రాష్ట్రానికి వెళ్లలేదని పోలీసులకు తెలిపాడు. ఢిల్లీలో చిన్నపాటి పనులు చేసుకునే సమయంలోనే ఓ బ్రోకర్ ద్వారా పాన్‌కార్డుకు అప్లై చేశానని, ఐతే పాన్‌కార్డు గురించి అతన్ని మళ్లీ కలవలేదని, పాన్‌కార్డు తీసుకోకపోయినా నా పేరు మీద ఈ నోటీస్ ఎలా వచ్చిందో తెలీదని గిరీశ్ పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టవల్సి ఉందని అలౌలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురేంద్ర కుమార్ మీడియాకు తెలిపారు.