
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం.. ‘అర్నబ్’ తుపానుగా నామకరణం చేశారు. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో తుపాన్ కదులుతోందని.. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో ఉంది. ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపాన్ గా.. రేపు అతి తీవ్ర తుపాన్ గా అర్నబ్ బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం (అక్టోబర్ 28 నాటికి) ఉదయం బాపట్ల – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రాణనష్టం జరగకుండా వివిధ శాఖలను అప్రమత్తం చేశాయి.
అర్నబ్ అర్థం.. ఆ పేరును నామకరణం ఎవరు చేశారు.. ఆ పేరు ఎలా వచ్చింది..? అనే వివరాలను తెలుసుకుందాం..
బెంగాలీ భాషలో ‘అర్నబ్’ అంటే సముద్రం లేదా మహాసముద్రం అని అర్థం.. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో (బంగాళాఖాతం – అరేబియా సముద్రం) ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టే విధానంలో భాగంగా.. ఈసారి బంగ్లాదేశ్ దేశం అర్నబ్ అనే పేరును సూచించింది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిషన్ (ESCAP) ప్యానెల్ నిబంధనల ప్రకారం.. ఈ ప్రాంతంలోని 13 దేశాలు ఉన్నాయి.. భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యూఏఈ, యెమెన్, ఇరాన్ కలిసి మొత్తం 169 తుఫాను పేర్ల జాబితాను రూపొందించాయి. వరుస క్రమంలో తుఫానులకు ఈ జాబితా నుంచి పేర్లు కేటాయిస్తారు.
ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో తుఫానులు ఏర్పడినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి, వాతావరణ హెచ్చరికలను సులభంగా అర్థం చేసుకోవడానికి, గందరగోళాన్ని నివారించడానికి తుఫానులకు నిర్దిష్టమైన పేర్లు పెట్టడం జరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.