చుక్కలను తాకుతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 నష్టం..!

మిడిల్‌ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 100 డాలర్లు దాటడంతో భారత్‌పై ఇంధన దిగుమతుల భారం పెరుగుతోంది. ICRA అంచనాల ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు సగటున రూ.5, డీజిల్‌పై రూ.23 వరకు ఆయిల్‌ కంపెనీలకు నష్టం వస్తోంది. చమురు ధరలు మరింత పెరిగితే ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.

చుక్కలను తాకుతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 నష్టం..!
Crude Oil Rates

Updated on: Sep 10, 2026 | 9:28 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో టెన్షన్‌ వాతావరణం మరింత పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను దాటింది. దీంతో మిడిల్‌ ఈస్ట్‌లో అశాంతి పెరిగితే క్రూడాయిల్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దేశ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో రష్యాతోపాటు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల వాటానే ఎక్కువ. అయితే యుద్ధంతో యూఏఈ, సౌదీ, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు ముడి చమురు, గ్యాస్‌ రాక ఇబ్బందికరంగా మారింది. పెట్రో ఉత్పత్తుల రవాణాకు కీలకమైన హొర్ముజ్‌ జలసంధిలో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నౌకలపై దాడులు జరిగితే బ్యారెల్‌ విలువ 120 డాలర్లను తాకే అవకాశం ఉంది. అమెరికాకు మద్దతిస్తున్నాయని గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులకు దిగుతోంది.

మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌లో పెట్రో ధరల పెంపునకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోంది. చమురు దిగుమతుల చెల్లింపుల భారం, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం విజృంభణ, రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపు, స్టాక్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు, రూపాయి మారకం విలువ క్షీణత, చమురు ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖరీదెక్కడం, ఎగుమతుల పతనం వంటివి దేశ ఎకానమీని రిస్క్‌లో పడేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభం కాగా.. అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశంలో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.7.35, డీజిల్‌ ధర రూ.7.53 పెరిగింది.

పెట్రోల్, డీజిల్‌పై ఆయిల్ కంపెనీలకు నష్టాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం)లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ విక్రయాలపై ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. పెట్రోలియం రంగ విశ్లేషకులు, రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ (ICRA) నివేదికల ప్రకారం.. పెట్రోల్ లీటర్‌పై సగటున రూ. 5 నష్టం ఉండగా.. డీజిల్ లీటర్‌పై ఏకంగా రూ. 23 నష్టం.. వంట గ్యాస్ (LPG) గృహ అవసరాలకు వాడే ఒక్కో సిలిండర్‌పై దాదాపు రూ. 200 వరకు నష్టం ఏర్పడిందని నివేదిక పేర్కొంది.

ఆర్బీఐ కీలక నిర్ణయం?:

చమురు సెగతో దేశంలో ద్రవ్యోల్బణం (ఫ్యూయల్ & రవాణా ఖర్చులు) పెరిగే ప్రమాదం ఉంది. దీనిని అదుపు చేయడానికి అక్టోబరు 7న ప్రకటించబోయే ‘ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష’లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25% నుండి 0.50% వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంధన ధరల భారం రవాణా రంగంతో పాటు ఏవియేషన్ (విమానయానం), పెయింట్స్, టైర్లు, కెమికల్ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి ప్రభుత్వ నియంత్రణ వల్ల వినియోగదారులపై నేరుగా పెట్రోల్ భారం పడకపోయినా, అంతర్జాతీయంగా పరిస్థితి సద్దుమణగకపోతే రాబోయే రోజుల్లో ఇంధన ధరల సమీక్ష అనివార్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

అమెరికాతో ఇరాన్‌ చర్చల కారణంగా అప్పట్లో కొంతమేర శాంతియుత పరిస్థితులు మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్నాయి. ఇది మార్కెట్‌లో క్రూడ్‌ ధరల తగ్గుముఖానికి కలిసొచ్చింది. అయితే మళ్లీ దాడులు మొదలవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో భారత ముడి చమురు దిగుమతుల విలువ 56 శాతం పెరిగి 63.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. నిరుడు ఇదే సమయంలో 40.5 బిలియన్‌ డాలర్లేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us