AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేన్లు, జేసీబీలు వచ్చినా.. అంగుళం కదని హనుమాన్! ఉత్కంఠ రేపుతున్న 170 ఏళ్ల ఆలయం

ఉజ్జయిని: భారీ క్రేన్లు.. జేసీబీలు.. ఆధునిక యంత్రాలు.. ఆలయ భవనం తొలగింపు.. అయినా ఆ విగ్రహం మాత్రం కదల్లేదట. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రస్తుతం ఓ పురాతన హనుమాన్ ఆలయానికి సంబంధించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సుమారు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడ్డే హనుమాన్ ఆలయం’ను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిలువెత్తు హనుమాన్ విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

క్రేన్లు, జేసీబీలు వచ్చినా.. అంగుళం కదని హనుమాన్! ఉత్కంఠ రేపుతున్న 170 ఏళ్ల ఆలయం
Ujjain Khade Hanuman
Balaraju Goud
|

Updated on: Sep 09, 2026 | 9:02 PM

Share

ఉజ్జయిని: భారీ క్రేన్లు.. జేసీబీలు.. ఆధునిక యంత్రాలు.. ఆలయ భవనం తొలగింపు.. అయినా ఆ విగ్రహం మాత్రం కదల్లేదట. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రస్తుతం ఓ పురాతన హనుమాన్ ఆలయానికి సంబంధించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సుమారు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడ్డే హనుమాన్ ఆలయం’ను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిలువెత్తు హనుమాన్ విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

నాలుగు రోజులుగా ప్రయత్నాలు.. అయినా కదలని హనుమాన్?

ఉజ్జయినిలో సింహస్థ మహాకుంభ్ 2028కు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాంతల్ స్క్వేర్ నుంచి ఛత్రి చౌక్ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సతీ గేట్ సమీపంలోని పురాతన ఖడ్డే హనుమాన్ ఆలయాన్ని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆలయాన్ని తరలించే క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం భారీ క్రేన్లు, జేసీబీలు, ఇతర యంత్రాలను ఉపయోగించారు. అయితే నిలబడి ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఎత్తి తరలించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఆలయ భవనాన్ని తొలగించినప్పటికీ విగ్రహం మాత్రం అంగుళం కూడా కదల్లేదని భక్తులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఘటనపై స్థానికంగా భక్తుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం వర్షం, ఇతర నష్టాల నుంచి విగ్రహాన్ని రక్షించేందుకు అధికారులు తాత్కాలిక పందిరి ఏర్పాటు చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘హనుమంతుడి అనుగ్రహంతోనే నిర్ణయం’

ఈ ఘటనపై ఆలయ పూజారి మహేష్ బైరాగి స్పందించారు. ఇంతకుముందు ఆలయాన్ని మరో ప్రాంతానికి తరలించే అంశంపై చర్చ జరిగిందని, తాను కూడా అందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. భక్తుల రద్దీ, వారి భావోద్వేగాలను చూస్తుంటే ఇక నిర్ణయం బజరంగబలి అభీష్టం మేరకే జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. “ఇదివరకు ఇది నా అదుపులో ఉండేది. ఇప్పుడు నా అదుపులో లేదు. హనుమంతుని అనుగ్రహంతోనే ఈ విగ్రహాన్ని తొలగించగలమని అనిపిస్తోంది” అని పూజారి పేర్కొన్నారు.

‘డాక్టర్ హనుమాన్’గా ప్రత్యేక గుర్తింపు

ఖడ్డే హనుమాన్ ఆలయానికి స్థానికంగా ప్రత్యేకమైన విశ్వాసం ఉందని పూజారి తెలిపారు. నిలబడి ఉన్న హనుమంతుడిని కొందరు ‘డాక్టర్ హనుమాన్’ అని కూడా పిలుస్తారని చెప్పారు. ఇక్కడ పూజలు, నైవేద్యాలు సమర్పిస్తే చిన్నపిల్లలకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల్లో నమ్మకం ఉందని వివరించారు. విగ్రహాన్ని ఆధునిక యంత్రాలతో తొలగించలేకపోయారన్న విషయం ప్రచారంలోకి రావడంతో ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వలేదన్న పూజారి

ఆలయాన్ని తరలించే విషయంలో తనకు కొన్ని షరతులు ఉన్నాయని పూజారి తెలిపారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఆలయాన్ని తరలించకూడదని తాను చెప్పినట్లు వెల్లడించారు. ఆలయాన్ని తరలించబోయే కొత్త ప్రదేశానికి సంబంధించిన పూర్తి పత్రాలను అందించాలని కోరినప్పటికీ అవి ఇంకా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా, తాను అక్కడికి వచ్చే ముందే రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని షరతు పెట్టినట్లు చెప్పారు. అయితే అధికారులు అకస్మాత్తుగా వచ్చి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

అసలు ఎందుకు తరలిస్తున్నారు?

ఉజ్జయిని నగరం సింహస్థ మహాకుంభ్‌కు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. 2028లో జరగనున్న సింహస్థ మహాకుంభ్ను దృష్టిలో ఉంచుకుని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగానే కాంతల్ స్క్వేర్–ఛత్రి చౌక్ మధ్య రహదారిని వెడల్పు చేస్తున్నారు. ఈ మార్గంలో సతీ గేట్ సమీపంలో ఉన్న పురాతన ఖడ్డే హనుమాన్ ఆలయం రహదారి విస్తరణ పరిధిలోకి రావడంతో దాన్ని తరలించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే విగ్రహాన్ని తరలించే ప్రయత్నం విఫలమవడంతో ఇప్పుడు అధికారుల తదుపరి చర్య ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

భక్తుల విశ్వాసం.. అధికారుల ముందున్న సవాలు

ఒకవైపు నగర అభివృద్ధి, సింహస్థ మహాకుంభ్ ఏర్పాట్ల కోసం రహదారుల విస్తరణ అవసరం కాగా.. మరోవైపు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు, భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ‘క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్ విగ్రహం’ అనే వార్త ఉజ్జయినిలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంగా మారడంతో ఆలయాన్ని ఎలా తరలిస్తారు? విగ్రహాన్ని అక్కడే ఉంచుతారా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us