బ్యాంక్ లాకర్లలోని బంగారానికి నష్టం జరిగితే పరిహారం ఎంత..?

Venkatrao Lella

Images: Pinterest

02  Sep 2026

ఇంట్లో బంగారు ఆభరణాలను పెట్టుకుంటే సురక్షితం కాదనే ఉద్దేశంతో చాలామంది బ్యాంక్ లాకర్లలో దాచుకుంటారు. ఇంట్లో కంటే బ్యాంకు లాకర్లలో సురక్షితంగా ఉంటాయని ప్రతీఒక్కరూ నమ్ముతారు.

అయితే బ్యాంక్ లాకర్లలో దాచుకున్న బంగారం చోరీకి గురైనా లేదా వాటికి ఎలాంటి నష్టం జరిగినా బ్యాంకు దానికి పూర్తి విలువ చెల్లిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇది ఒక అపోహ మాత్రమే. ఆర్బీఐ కొన్ని నియమాలను తెచ్చింది.

బ్యాంకు నిర్లక్ష్యం లేదా లోపం, దోపిడీ, అగ్నిప్రమాదం వంటి కారణాలతో లాకర్లలోని బంగారానికి నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించాలి. ఎంత చెల్లించాలనే దానిపై ఒక గరిష్ట పరిమితి ఉంది.

బంగారానికి నష్టం జరిగినప్పుడు మార్కెట్ విలువ మొత్తం బ్యాంక్ చెల్లించాల్సిన అవసరం లేదు. వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి

మీ వార్షిక లాకర్ అద్దె రూ. 4 వేల ఉండి.. లాకర్లలోని వస్తువుల విలువ రూ. 10 లక్షలు అనుకుందాం. అప్పుడు గరిష్టంగా రూ. 4 లక్షలు చెల్లిస్తుంది.

లాకర్లలో ఖచ్చితంగా ఏమి ఉంచుతారు.. వాటి విలువ ఎంత అనేది బ్యాంకులకు తెలియదు. లాకర్‌లో నిల్వ ఉన్న ప్రతి వస్తువు పూర్తి జాబితాను నిర్వహించాల్సిన అవసరం కూడా బ్యాంకులకు ఉండదు.

లాకర్‌లోని వస్తువుల విలువ తెలియదు కాబట్టి ఆర్‌బిఐ ఒక నిర్దిష్ట పరిమితిని విధించింది. లాకర్ అద్దె చెల్లించినంత మాత్రాన.. లోపల నిల్వ ఉన్న ప్రతి వస్తువుకు బ్యాంకు పూర్తి బీమా కవరేజీని అందిస్తున్నట్లు కాదు.

భూకంపాలు, వరదలు, పిడుగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు బ్యాంకు పరిహారం చెల్లించదు. వినియోగదారుడి స్వంత నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగినా బ్యాంకుకు బాధ్యత ఉండదు.

మీరు బ్యాంకు లాకర్లలో బంగారాన్ని భద్రపర్చుకుంటుంటే.. వాటికి సంబంధించిన రుజువులను మీ వద్ద ఉంచుకోండి. ఏదైనా అనుకొని ఘటన జరిగినప్పుడు ఇవి ఉపయోగపడతాయి.