మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యాంకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ డ్యాం దగ్గరున్న ప్రాంతాలు నేలమట్టం కావడంతో పాటు 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ డ్యాంకు గండిపడటానికి కారణం ఎండ్రికాయలేనని(పీతలు) ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ పేర్కొన్నారు. గత 15ఏళ్లుగా డ్యాంలో నీటిని నిల్వ చేస్తున్నామని.. ఎప్పుడూ ఇలా గండిపడలేదని ఆయన అన్నారు. ఇక ఇటీవల డ్యాంలో ఎండ్రికాయలు విపరీతంగా పెరిగాయని.. అవి రంధ్రాలు చేయడం వలనే గండి పడిందని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంత్రి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రత్నగిరి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. మంత్రి ఇంటిలో పేరుకుపోయిన ఎండ్రికాయలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఆయన వ్యంగంగా విమర్శించారు.