సెప్టెంబర్ చివరినాటికి చిన్నారులకు కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే డైరక్టర్ ప్రియ అబ్రహం అన్నారు. కోవిడ్-19 వ్యవహారంపై జరుగుతున్న తాజా పరిశోధనల వివరాలను వెల్లడించిన ఆమె, 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులపై భారత్ బయోటెక్ రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’తో క్లినికల్ ట్రయల్స్ ఫేజ్-2, ఫేజ్-3 దాదాపు పూర్తికావొచ్చాయని, వాటి ఫలితాలు త్వరలో బహిర్గతమవుతాయని అన్నారు. ఫలితాల ఆధారంగా రెగ్యులేటరీ సంస్థకు దరఖాస్తు చేసుకుని, అనుమతులు పొందడానికి సెప్టెంబర్ చివరి వారం వరకు సమయం పట్టవచ్చని, అత్యవసర వినియోగం కోసం అనుమతులు పొందడమే ఆలస్యం వ్యాక్సిన్ డోసులకు చిన్నారులకు సైతం అందించడానికి ఆస్కారం ఉంటుందని ఆమె అన్నారు. కోవాక్సిన్‌తో పాటు జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌తోనూ చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముందని వివరించారు.
పైప్‌లైన్లో పలు వ్యాక్సిన్లు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా పరిధిలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన వేర్వేరు కంపెనీల కోవిడ్-19 వ్యాక్సిన్లకు తోడు, మరికొన్ని సంస్థల వ్యాక్సిన్లు పైప్‌లైన్లో ఉన్నాయని ప్రియ అబ్రహం వెల్లడించారు. వీటిలో డీఎన్ఏ ప్లాట్‌ఫాంపై జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్టు ఆమె తెలిపారు. దీంతో పాటు జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ రూపొందిస్తున్న ఎం-ఆర్ఎన్ఏ తరహా వ్యాక్సిన్, బయోలాజికల్-ఈ సంస్థ రూపొందించే వ్యాక్సిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా నోవోవ్యాక్స్, భారత్ బయోటెక్ రూపొందిస్తున్న చుక్కల మందు (ముక్కు ద్వారా అందించే తరహా వ్యాక్సిన్) వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.
డెల్టా ప్లస్‌పై వ్యాక్సిన్ల ప్రభావం?
‘డెల్టా’తో పోల్చుకుంటే ‘డెల్టా ప్లస్’ రకం కరోనా వైరస్ అంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం లేదని ప్రియ అబ్రహం అంచనా వేస్తున్నారు. శరవేగంగా వ్యాప్తిచెందే లక్షణం కల్గిన ‘డెల్టా’ రకం ఇప్పటికే 130కి పైగా దేశాల్లో విస్తరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ రకంపై తాము నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పలు అధ్యయనాలు జరిపామని చెప్పారు. వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీస్ ఈ రకం కరోనా వైరస్‌పై రెండు నుంచి మూడింతల మేర తక్కువ ప్రభావాన్ని చూపాయని ఆమె అన్నారు. అయినప్పటికీ, ఈ రకం నుంచి రక్షణ కల్పిస్తున్నాయని వివరించారు. “ప్రభావం తక్కువే కావొచ్చు, కానీ వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. ఆస్పత్రిపాలు కాకుండా చేస్తాయి. ప్రాణాపాయం నుంచి కాపాడతాయి” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వ్యాక్సిన్లను తీసుకునే విషయంలో ఎలాంటి సంకోచాలు, అపోహలు పెట్టుకోవద్దని ఆమె హితవు పలికారు.
బూస్టర్ డోస్ సిఫార్సులు వస్తాయి – కానీ ఇప్పుడే కాదు
వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ మరొక బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయని, ఇప్పటికే 7 వేర్వేరు కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయని ప్రియ అబ్రహం తెలిపారు. అయితే ప్రపంచంలో అనేక దేశాల్లో ఇంకా మొదటి డోసే అందుకోలేకపోతున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున, బూస్టర్ డోస్ వ్యవహారాన్ని నిలిపేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. పేద, ధనిక దేశాల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే భవిష్యత్తులో బూస్టర్ డోసుపై సిఫార్సులు వస్తాయని ప్రియా అబ్రహం చెబుతున్నారు.
మిక్స్ అండ్ మ్యాచ్
వేర్వేరు కంపెనీలు రూపొందించిన వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రభావంపై విదేశాల్లో అధ్యయనం చేస్తుంటే, భారతదేశంలో పొరపాటున మొదటి డోసు ఒక రకం వ్యాక్సిన్, రెండవ డోసు మరొక రకం వ్యాక్సిన్ ఇచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ శాంపిళ్లను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విశ్లేషించి అధ్యయనం చేసిందని, వేర్వేరు డోసులు మిశ్రమం కావడంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోగా, వ్యాధినిరోధకత విషయంలో స్వల్ప మెరుగు కనిపించిందని ఆమె చెప్పారు. వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మరింత లోతుగా అధ్యయనాలు జరుపుతున్నామని ఆమె అన్నారు.
కరోనా అంతం మన చేతుల్లోనే…
దేశంలో అనేక ప్రాంతాల్లో రద్దీ మార్కెట్లు, జనసమ్మర్థ దృశ్యాలపై స్పందిస్తూ.. ఈ పరిస్థితులు మరొక వేవ్ (థర్డ్ వేవ్)ను ఆహ్వానిస్తాయని ప్రియ అబ్రహం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డా. టెడ్రోస్ ఏ ఘెబ్రెయూసుస్ చెప్పినట్టుగా ఈ మహమ్మారి అంతం మన చేతుల్లోనే ఉందని, మనం ఎప్పుడు అంతమవ్వాలని కోరుకుంటే అప్పుడే అవుతుందని అన్నారు. రానున్న పండుగల సీజన్లో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, జనం గుంపులుగా, రద్దీగా మారకుండా నియంత్రించుకున్నప్పుడే వైరస్ వ్యాప్తి ఆగుతుందని ఆమె అన్నారు. రూపాంతరం చెందే సహజ స్వభావం వైరస్‌కు ఉంటుంది కాబట్టి, రానున్న రోజుల్లో మరికొన్ని రకాల మ్యుటేషన్లు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయితే మాస్కు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే ఈ తరహా వైరస్ వ్యాప్తి నుంచి రక్షణ పొందవచ్చని ఆమె నొక్కి చెప్పారు. అప్పుడే మరొక వేవ్ వచ్చినా, అది తీవ్రరూపం దాల్చకుండా ఉంటుందని సూత్రీకరించారు.
Also Read: ఏపీ, తెలంగాణలో మొహర్రం సెలవు తేదీ మారుస్తూ ఉత్తర్వులు.. కొవిడ్ మార్గదర్శకాలు విడుదల