Coronavirus: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గిపోతున్నాయి. రెండేళ్ల నుంచి వణికిస్తున్న కోవిడ్.. థర్డ్‌వేవ్‌లో తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం వైరస్ క్షీణత కనిపిస్తోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజువారీ కేసుల పరంగా పరిశీలిస్తే.. మునుపటి రోజు 7.42 శాతం నుంచి ఈ రోజు 7.25 శాతానికి తగ్గింది. క్రమంగా కరోనా క్షీణిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 67,597 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , 1188 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, దీనికి ఒక రోజు ముందు నిన్న (సోమవారం), 83 వేల 876 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 896 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపశమనం ఏమంటే, గత 24 గంటల్లో ఒక లక్షా 80 వేల 456 మంది కరోనా నుండి కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం ఒక లక్షా 14 వేల యాక్టివ్ కేసులు(Active cases) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల 23 లక్షల 39 వేల 611 మందికి వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 5 లక్షల 4 వేల 62 మంది మరణించారు. ఇప్పటివరకు 4 కోట్ల 8 లక్షల 40 వేల మంది కూడా కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల కంటే తక్కువగా ఉంది. మొత్తం 9 లక్షల 94 వేల 891 మంది ఇంకా కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతం ఉంది. ఇక యాక్టివ్ కేసులు 2.62 శాతంగా ఉంది. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్యాపరంగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. కాగా, అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. అయితే మార్చి నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ మాత్రం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు లేకున్నా.. దాని ప్రభావం పెద్దగా ఉండదని వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ చావ్లా తెలిపారు. అయితే వైరస్ కారణంగా పెద్దగా ప్రమాదమేమి ఉండకపోగా, కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని అన్నారు. డెల్టా, ఒమిక్రాన్ వైరస్ కారణంగా తీవ్రమైన ప్రభావమేమి ఉండదంటున్నారు.
రుచి, వాసన కోల్పోవడం..
తాజా నివేదిక ప్రకారం.. కోవిడ్‌తో బాధపడుతున్న సగం మంది దీర్ఘాకలిక సమస్యలకు గురవుతారని అన్నారు. అయితే స్టాక్ హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు మార్చి 2020లో మొదటి దశ కరోనా బారిన పడిన వారిలో 100 మందిపై పరిశోధనలు చేశారు. 18 నెలల తర్వాత దాదాపు 20 మందిలో ఒకరు వాసన కోల్పోవడం వంటివి అలాగే ఉన్నాయని గుర్తించారు. అలాగే గతంలో కరోనా బారిన పడి కోలుకున్న ఆరు నెలల తర్వాత కూడా ఈ లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు. జలుబు, ప్లూ, శ్వాసకోశ సమస్యలతో బాధపడతారని అన్నారు. 2021లో కరోనాతో చికిత్స పొందిన వారు అన్ని రకాల రుచులు చూడలేకపోతున్నారని పరిశోధకులు గుర్తించారు. కొన్ని వైరస్‌ల కారణంగా శరీరంలో నరాలు దెబ్బతింటున్నాయని, శరీరం నుంచి వైరస్ వెళ్లిపోయిన తర్వాత కూడా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడతారని ఢిల్లీ ఎయిమ్స్ శ్వాసకోస వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. శ్రీనివాసన్ తెలిపారు.
బరువు తగ్గడం..
సెకండ్, థర్డ్‌వేవ్‌లో డెల్టా, ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని, దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయని డాక్టర్ చావ్లా తెలిపారు. వైరస్ బారిన పడిన వారు బరువు తగ్గడం జరుగుతుందని, కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుందని అన్నారు. కోవిడ్ బారిన పడిన తర్వాత బరువు చాలా తగ్గిపోయినట్లు ఓ వ్యాపార వేత్త తెలిపారు. బరువు తగ్గడం అనేది సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓ కోవిడ్ బారిన పడిన కోలుకున్న తర్వాత ఏడాది పాటు బరువు తగ్గడం అనేది జరుగుతుందని, అలా బరువు తగ్గుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని, లేకపోతే ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు.
అలసట అనిపించడం..
ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వ్యక్తులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు చారు గోయెల్ సచ్‌దేవా. థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ బారిన పడిన వారికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని, తీవ్రమైన అలసట కూడా ఉంటుందంటున్నారు. ఇలా కోవిడ్ బారిన పడిన వారు మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: