PM Modi: అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం తప్పదు.. కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో ఇవాళ ప్రధాని మోడీ సమీక్ష

|

Aug 24, 2021 | 11:28 AM

కరోనా మూడో ముప్పు పొంచి ఉంది. నిపుణులు ఇచ్చిన నివేదిక. సెకండ్ వేవ్ కంటే.. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. పైగా చిన్న పిల్లల పాలిట యమగండంగా మారబోతోంది. అప్రమత్తమైన కేంద్రం

PM Modi:  అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం తప్పదు.. కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో ఇవాళ ప్రధాని మోడీ సమీక్ష
Pm Modi
Follow us on

 PM Narendra Modi Covid 19 Review:  కరోనా మూడో ముప్పు పొంచి ఉంది. నిపుణులు ఇచ్చిన నివేదిక. సెకండ్ వేవ్ కంటే.. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. పైగా చిన్న పిల్లల పాలిట యమగండంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తోంది.

కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్‌ పరిస్థితులు, థర్డ్‌ వేవ్‌పై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, కేబినెట్ సెక్రెటరీ, నీతి ఆయోగ్ సభ్యులు సైతం హాజరు కానున్నారు. అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌కు అవకాశం ఉందని, కరోనా కేసులు తారాస్థాయికి చేరుకుంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ తన నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది. కమిటీ నివేదికలో అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది.

కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. చిన్నారుల వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించింది. కరోనా థర్డ్‌వేవ్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని ఈ నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కోసం ఏర్పాటు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని ఎన్ఐడీఎం నిపుణులు సూచించారు. దేశంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉందని.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ ఖాళీల భర్తీ చేయాలని సూచించింది. ఈ క్రమంలో ప్రధాని భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనంటూ కేంద్రానికి రిపోర్ట్‌ ఇచ్చింది NIDM. అక్టోబర్ నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశముందని కేంద్రాన్ని హెచ్చరించింది. పెద్దల కంటే పిల్లలపైనే ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని..అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలని సూచించింది. చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడితే.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని పేర్కొంది. చిన్న పిల్లలకు వైద్య కోసం డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పిల్లలకు కరోనా టీకా వేయాలని సూచించింది. పిల్లలకు తగ్గట్లుగా కొవిడ్‌ వార్డుల్లో మార్పులు చేయాలని తెలిపింది.

మరోవైపు, ఇప్పుడిప్పుడే భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్‌ వేవ్‌ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈసారి పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని..పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించింది నిపుణుల కమిటీ. వీలైనంత త్వరగా పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేసింది. చిన్నారుల్లో ఇన్‌ఫెక్షన్ సోకితే ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని..వ్యాక్సినేషన్‌తో థర్డ్ వేవ్ ఉధృతిని కొంత అరికట్టవచ్చునని సూచించింది.

Read Also… బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ చొరవ..అఫ్గానిస్తాన్ పై చర్చకు నేడు జీ-7 దేశాల కూటమి అత్యవసర సమావేశం..