Portable Oxygen concentrators: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపతక్కర పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారింది. గత వారం నుంచి ఆక్సిజన్ కొరతతో వందలాది మంది మృత్యువాతపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ కొరతను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ చేస్తున్న పోరాటానికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అండగా నిలిచింది. ఈ మేరకు అమెజాన్ ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్, పూణె ప్లాట్‌ఫామ్ ఫర్ కొవిడ్-19 రెస్పాన్స్ (పీపీసీఆర్) తదితర సంస్థలతో చేతులు కలిపి దేశంలోని పలురాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది.
దీనికోసం సుమారు 8వేలపైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500 బైపీఏపీ మెషీన్లను అందించేందుకు అమెజాన్ ముందుకు వచ్చింది. సింగపూర్ నుంచి భారత్‌కు విమానాల ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500 బైపీఏపీ మెషీన్లను తరలిస్తోంది. ఈ పరికరాలను తరలించే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500 బైపీఏపీ మెషీన్లను అత్యవసరం ఉన్న ఆసుపత్రులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఆదివారం దేశవ్యాప్తంగా 3,52,991 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 2812 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,13,163 (1.73 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,95,123 కి చేరింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి.. అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో 28,13,658 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Also Read;