Gold Mask : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి జీవితం కరోనా కు ముందు… తర్వాత అన్న చందంగా మారిపోయింది. ఓ వైపీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నా..కరోనా నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే నని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా అందరూ హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాస్క్ ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు కానీ.. ఈ మాస్క్ ను అంతకు ముందు కూడా ఆసియా దేశాలైన, చైనా, జపాన్, దక్షిణ కొరియా లోని పలువురు మాస్క్ ను ధరించేవారు. అయితే కరోనా నేపథ్యంలో కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరి.. దీంతో మాస్క్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.
బయటకు వెళ్తే మాస్కు తప్పనిసరి. మాస్క్ లేనిదే మనుగడలేదు. ఆ మాస్క్‌లలో సర్జికల్ మాస్క్, ఎన్ 95 మాస్క్, క్లాత్ మాస్క్, డబుల్ మాస్క్..ఇలా అనేక రకాల మాస్కులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో మాస్కులపై ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటివి వేసి అమ్మకానికి పెడుతున్నారు. అయితే ఓ వ్యక్తి.. మాస్క్ ను ఏకంగా బంగారం తో చేయించుకుని వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనోజ్ సెంగార్ అనే వ్యక్తి మాస్క్‌ను బంగారంతో చేయించుకున్నారు. గోల్డెన్ బాబాగా పేరుగాంచిన మనోజానంద మహారాజ్ బంగారంతో చేయించిన మాస్క్ ను ధరించి చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలిచాడు. ఈ మాస్క్ ధర అక్షరాలా ఐదు లక్షలు. తన బంగారు మాస్క్ పై స్పందించిన గోల్డెన్ బాబా దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు మాస్క్ లను సరిగ్గా ఉపయోగించడం లేదని అన్నారు. అయితే తాను చేరించుకున్న బంగారం మాస్క్ లో ట్రిపుల్ కోటింగ్ ఉందని చెప్పారు. అంతేకాదు.. ఈ మాస్క్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. తన బంగారం మాస్క్ మూడేళ్ళ పాటు పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోల్డెన్ బాబా