Reliance Foundation: దేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. రోజురోజుకు లక్షల్లో పాజిటివ్ కేసలు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. బెడ్లు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతోంది. ఈ తరుణంలో దేశీయ అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) పెద్దమనసు చాటుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో జామ్‌నగర్‌లో కరోనా రోగుల కోసం పెద్ద కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వెయ్యి పడకల కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మొదటి దశలో 400 పడకలు ఒక వారంలో, మరో 600 పడకలు మరో వారంలో సిద్ధంగా ఉంటాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు.
ఆర్‌ఐఎల్ చెందిన రిలయన్స్ పౌండేషన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆక్సిజన్ సౌకర్యంతో ఈ కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఈ కోవిడ్ కేర్ ఫెసిలిటీలో అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అయితే నాణ్యమైన పేవలు ఉచితంగా అందిస్తామని నీతా అంబానీ పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఆర్‌ఐఎల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. వచ్చే ఆదివారం నాటికి జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీ 400 పడకల ఆస్పత్రిని ప్రారంభం అవుతుందని వెల్లడించారు.ఆ తర్వాత వారంలో వెయ్యి పడకల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.