MLC Kavitha: కవితకు జైల్లో జపమాల, స్పోర్ట్స్ షూ ఇచ్చేందుకు కోర్టు అనుమతి

| Edited By: TV9 Telugu

Apr 05, 2024 | 5:56 PM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనుల జరిగాయి. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 4వ తేదీకి వాయిదా పడింది. కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు, షూ అందించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది.

MLC Kavitha:  కవితకు జైల్లో జపమాల, స్పోర్ట్స్ షూ ఇచ్చేందుకు కోర్టు అనుమతి
Kalvakuntla Kavitha
Follow us on

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 4వ తేదీకి వాయిదా వేసింది రౌస్‌ అవెన్యూ కోర్టు. చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేశారు కవిత. ఈనెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు. కవిత పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.

కవిత తరపున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు విన్పించారు. కవితకు రెగ్యులర్‌ బెయిల్‌ కావాలని పిటిషన్‌ వేశారా ? లేక మధ్యంతర బెయిల్‌ కావాలని పిటిషన్‌ వేశారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. మధ్యంతర బెయిల్‌తో పాటు రెగ్యులర్‌ బెయిల్‌ కూడా ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు.

“ఇంటి భోజనంతో పాటు కవితకు 10 పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ధ్యానం చేసుకోవడానికి జపమాలను కూడా కోర్టు అనుమతిచ్చింది. స్పోర్ట్స్ షూ కూడా కావాలని కోరగా.. అది కూడా లేస్ లేని షూస్ ఇవ్వాలని కోరగా.. అందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది.  బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా పడింది. రెగ్యులర్‌ బెయిల్‌తో పాటు మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశాం” అని కవిత తరపు న్యాయవాది నితిన్‌ రాణా తెలిపారు.

అయితే కవిత బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈడీ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు సమయం కోరారు సింఘ్వీ. ఈనెల 3వ తేదీ సాయంత్రం సమాధానం ఇస్తామని తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మార్చి 15వ తేదీన ఈడీ కవితను అరెస్ట్‌ చేసింది. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు. ప్రస్తుతం ఆమె తిహార్‌ జైల్లో ఉన్నారు.

తిహార్‌ జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం , పుస్తకాలు , షూ అందించాలని మరోసారి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఇదే ఆదేశాలు జారీ చేసినప్పటికి జైలు అధికారులు పాటించలేదని కవిత కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కవితకు ధ్యానం చేసుకోవడానికి జపమాలను కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి