Janata Curfew Anniversary: జనతా కర్ఫ్యూకి ఏడాది పూర్తి.. మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారి

| Edited By: Team Veegam

Mar 22, 2021 | 2:05 PM

Corona Lock Down: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది. భారత్‌లో తొలి సారి ప్రకటించిన జనతా కర్ఫూకి ఈరోజుతో ఏడాది..

Janata Curfew Anniversary: జనతా కర్ఫ్యూకి ఏడాది పూర్తి.. మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారి
lockdown
Follow us on

Corona Lockdown: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ పేరుతో మరోసారి పంజా విసురుతుంది. భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత నియంత్రణకు దేశ వ్యాప్తంగా తొలి సారి ప్రకటించిన జనతా కర్ఫూకి ఈరోజుతో ఏడాది పూర్తవుతోంది. వైరస్ బారిన పడిన ప్రజలను ప్రాణాలకు తెగించి చికిత్సను అందిస్తున్న వైద్యులకు సంఘీభావంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 22 వ తేదిన జనతా కర్ఫూని విధించి ప్రజలు మద్దతును కోరారు. అపట్లో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పరిస్థితులు, వైద్యులు, నిపుణుల సూచన మేరకు తెలంగాణలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు సీఎం కెసిఆర్ మార్చి 23వ తేదిన అందరికంటే ముందు లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా కూడా క్రమక్రమంగా వ్యాప్తి భారీగా పెరగడంతో విడతల వారీగా పొడిగిస్తూ వచ్చారు.

ఇక దేశంలో తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. 10 రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. కేవలం మూడు రోజుల్లోనే లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గురువారం 35,871, శుక్రవారం 39,726 కేసులు నమోదు కాగా, శనివారం ఏకంగా 40,953 కొత్త కేసులు రికార్డయ్యాయి. దాదాపు 111 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఒక్క మహారాష్ట్రలోనే 25,681 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 1,11,07,332 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,88,394 (మొత్తం కేసుల్లో 2.49 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 96.12 శాతంగా ఉందని వెల్లడించింది. శనివారం 188 మంది చనిపోగా, మొత్తం డెత్స్ సంఖ్య 1,59,558కి చేరుకుంది. ఇందులో మహారాష్ట్రలో 70 మంది చనిపోయారు. ఓవరాల్​గా మహారాష్ట్రలో 53,208 డెత్స్ నమోదయ్యాయి. దేశంలో 70 శాతం డెత్స్ కోమార్బిడిటీస్ వల్లే జరుగుతున్నాయని హెల్త్ మినిస్ట్రీ చెబుతోంది.

చిన్నపిల్లలపై కనిపించని వైరస్ ప్రభావం:

అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం చిన్నపిల్లలపై కనిపించడం లేదు. పిల్లలకు రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండడం, చిన్నవయసులో వారు తీసుకునే ఇతరత్రా వ్యాక్సిన్లే ఇందుకు కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా.. కరోనా పాజిటివ్‌ తల్లుల పాలు తాగినా.. పిల్లలకు వైరస్‌ సోకకపోవడం గమనార్హం. గత ఏడాది వ్యవధిలో కరోనా సోకిన 508 మంది చిన్నారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేశారు. వారిలో 20 మంది బ్లడ్‌ కేన్సర్‌ బాధితులే. ఆ 20 మందిలో ఒక్కరు తప్ప.. మిగతా 19 మందికి చికిత్సతో నెగెటివ్‌ వచ్చింది. అలాగే.. 43 మంది నవజాత శిశువులకు కరోనా సోకగా.. 40 మంది కోలుకుని ఇళ్లకు క్షేమంగా చేరుకున్నారు. ఇతరత్రా గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులున్నవారు దాదాపు 30 మంది దాకా ఉన్నారు. ఈ 508 మందిలో.. చనిపోయినవారు ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న 18 మంది మాత్రమే. పిల్లలపై కరోనా ప్రభావం తక్కువగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా సోకినా 99 మందికి ఎలాంటి సమస్యలు రావట్లేదు. ఐదు-పదేళ్లలోపు పిల్లల్లో మాత్రం అతి కొద్దిమందిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందులో 9, 10 ఏళ్ల పిల్లలు కొందరికి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని గాంధీ ఆస్పత్రిలో పిల్లల వైద్యులు చెబుతున్నారు.. కరోనా బారిన పడిన పెద్దల్లో ఎక్కువగా కనిపించిన సమస్యలు.. రక్తనాళాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలేవీ పిల్లల్లో కనిపించలేదు. వారిలో శ్వాస సంబంధిత సమస్యలు కూడా తక్కువగా ఉన్నట్టు గమనించామని మెడికవర్‌ ఆస్పత్రిలో బాలల వైద్యులు తెలిపారు.

తెలంగాణలో మళ్లీ మహమ్మారి విజృంభణ:

తెలంగాణలో మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 400 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. వీరిలో సుమారు 100 మందికి పైగా విద్యార్ధులు ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నెల రోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అయింది. ముఖ్యంగా విద్యాసంస్థలపై అత్యధిక వ్యాప్తి కొనసాగుతుంది. భౌతిక దూరం పాటించకపోవడం వలనే విద్యార్ధుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ ఇప్పటికే అంచనా వేసింది.ఈమేరకు బోర్డర్లలో ప్రత్యేక పరీక్షలు చేస్తున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. వైరస్ తీవ్రత మరింత పెరగకముందే అర్హులైన వారంతా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యశాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో టెన్షన్ ప్రారంభమైంది. గతేడాది ఇదే నెల నుంచి వందల్లో ప్రారంభమైన కేసులు వ్యాప్తి క్రమక్రమంగా పెరిగి సుమారు ఐదారు నెలల వ్యవధిలో లక్షల్లోకి చేరాయి. దీంతో ఈ సారి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రజలతో పాటు అధికారుల్లో కూడా భయాందోళన కనిపిస్తుంది. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో ఒక్కసారిగా వైరస్ విజృంభించింది. ఆ వ్యాప్తి మన రాష్ట్రానికి వస్తే మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారేమోనని అనేక మందికి అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర తీవ్రత తక్కువున్నప్పటికీ, మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ యోచిస్తుంది.

ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా 648 మందికి పాజిటివ్ తేలగా, నలుగురు చనిపోయారు. అదే విధంగా ఈనెల 18 నుంచి 21 వరకు ఏకంగా 1349 మందికి వైరస్ సోకగా, పది మంది మరణించారు. అంటే నెలరోజుల్లోనే బాధితుల సంఖ్య రెట్టింపైంది. అంతేగాక మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో అధికారులు కూడా కలవరం చెందుతున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం ప్రజలంతా సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతానికి కేంద్రం ప్రభుత్వం సూచించిన కేటగిరీల ప్రకారం మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా, అతి కొద్ది రోజుల్లో మిగతా వారందరికీ టీకా ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. మరోవైపు అర్హత కలిగి ఇప్పటి వరకు టీకా తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు.

స్కూళ్లల్లో ర్యాపిడ్ టెస్టులు

రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని స్కూళ్లల్లో ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల అధికారులకు సూచించింది. కేసులు తేలిన విద్యాసంస్థలతో పాటు మిగతా వాటిలోనూ విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.ప్రతి స్కూల్, హాస్టల్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కాంటాక్ట్‌లను వేగంగా ట్రేస్ చేయాలని ఆదేశించింది. పాజిటివ్ సోకిన బాధితులను ఐసోలేషన్ సెంటర్లుకు తరలించాలని పేర్కొంది. అంతేగాక ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు యాంటీజెన్ టెస్టు విధానంలో వెంటనే టెస్టు చేసి క్వారంటైన్‌లో ఉంచాలంది. లక్షణాలు ఉన్న వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లను హాస్టల్స్‌లో వేర్వేరు రూంలలో ఉంచాలని సూచించింది. అలాంటి సౌకర్యం లేనిచో వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని వివరించింది. మరోవైపు పాజిటివ్ వచ్చిన బాధితులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యార్ధులను తల్లిదండ్రుల వద్దకు పంపొద్దని వైద్యశాఖ స్పష్టం చేసింది. దీంతో వైరస్ తీవ్రత మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి విద్యార్ధిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.

వైద్యశాఖ మరోసారి మార్గదర్శకాలు జారీ

కరోనా నియంత్రణకు వైద్యశాఖ మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పక 14 రోజుల పాటు స్వీయనిర్భందంలో ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయినవారు తప్పక ఐసోలేషన్ ఉండాలి. కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా తక్షణం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. కోవిడ్ 19కి సంబధించిన ఎలాంటి సమాచారం కోసమైనా 104ని సంప్రదించాలి.తుమ్మేటప్పుడు, దగ్గేప్పుడు తప్పనిసరిగా ఖర్చీఫ్ లు, టిష్యూ పేపర్లను వినియోగించాలి. తరచు చేతులను సబ్బు నీటితో, సానిటైజర్లతో కనీసం 30 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి . ఎక్కువ జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో సంచరించవద్దని హెచ్చరించింది.

Read More: Telangana Budget: వారి చూపంతా అసెంబ్లీవైపే.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటనటపై ఉత్కంఠ