కర్ణాటక లో లాక్ డౌన్ అమలులో ఉండగా సెకండ్ వేవ్ లో కోవిద్ కేసులు తగ్గుతున్నప్పటికీ ముఖ్యంగా బెంగుళూరు నగరంలో మరణాల రేటు తగ్గకపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో ఈ సిటీలో మరణాలు రెట్టింపు అయ్యాయని అధికారులే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర చోట్ల ఈ రేటు 2.62 శాతం ఉండగా బెంగుళూరులో మాత్రం 7.71 శాతం ఉందని వారు చెప్పారు. నగరంలో నిన్న ఒక్కరోజే 187 మంది కోవిద్ రోగులు మరణించారు. ఇప్పటివరకు మొత్తం 14,875 మంది మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో 15-20 రోజులుగా ఉన్నవారు ఎక్కువగా మృతి చెందుతున్నారని డిప్యూటీ సీఎం అశ్వత్థనారాయణ తెలిపారు. పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వైద్య బృందం రోగుల ప్రాణాలు కాపాడడానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ బెడ్స్ ఇంకా రోగులతో నిండిఉన్నాయని..వారు కోలుకోవడానికి మరి కొంతకాలం పడుతుందని కర్ణాటక కోవిద్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ విఠల్ రావు అన్నారు. అయితే సాధారణ వార్డు బెడ్స్ లో సుమారు 80 శాతం ఖాళీ అయ్యాయని, అలాగే ఆక్సిజనరేటెడ్ బెడ్స్ లో 50 శాతం ఖాళీ అయ్యాయని సమాచారం అందిందని ఆయన వెల్లడించారు.
కాగా దేశంలో పలు చోట్ల ఆన్-లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున బెంగుళూరులో మరణాల సంఖ్య తగ్గి పరిస్థితి కుదుట పడిన పక్షంలో రాష్ట్రంలో కూడా ఆంక్షలను సడలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోందని అంటున్నారు.ఈ కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆరు బయట నవారు మంచం మీద పిల్లలతో అలా బన్నీ హాయి ని అనుభవిస్తున్న అల్లు అర్జున్ : Allu Arjun Video viral.