కట్నం తక్కువ ఇచ్చారనే కారణంతో తాళి కట్టే నిమిషం వరకూ వచ్చిన పెళ్లిని కూడా ఆపేసే సంఘటనలు జరగడం చూసి ఉంటాం. పెళ్లి ఇష్టం లేదనే కారణంతో పెళ్లి పీటల నుంచి పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు వెళ్లిపోయిన సంఘటనల గురించీ వినే ఉంటాం. కానీ బ్యాండ్ కు డబ్బులు చెల్లించలేదన్న కారణంతో వివాహాన్ని రద్దు చేసుకున్న సంఘటన గురించి ఎక్కడైనా విన్నారా. వినడానికి కొత్తగానే ఉన్నా.. జరిగింది మాత్రం ఇదే. ఉత్తర్ ప్రదేశ్ లోని సహారాన్ పూర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లోని కంపిల్ నుంచి సహరాన్‌పూర్‌లోని మీర్జాపూర్ వరకూ ధర్మేంద్ర అనే పెళ్లి కొడుకు బారాత్ తో వచ్చాడు. సంప్రదాయ పద్ధతిలో అక్కడికి చేరిన పెళ్లిబృందం బారాత్ బ్యాండ్ కు ఇవ్వవలసిన మొత్తాన్ని పెళ్లి కూతురు తరపు వాళ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దానికి వారు నిరాకరించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో కోపోద్రోక్తుడైన పెళ్లి కొడుకు తన మెళ్లో ఉన్న హారాన్ని తెంచేసి తనతో వచ్చిన పెళ్లి బృందాన్ని సైతం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో పెళ్లి కూతురి తరఫు బంధువులు అవాక్కయ్యారు. ఇలా కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్య పడలేదు.