సవరించిన పౌరసత్వ చట్టంపై దేశంలో జరుగుతున్న హింస, అల్లర్లను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఖండించారు. వీటిని ప్రేరేపించేవారు నేతలు కారని, లీడర్ అంటే ముందుండి నడిపించేవాడు కానీ హింసాత్మక ఘర్షణలను రెచ్చగొట్టేవాడు కాదని ఆయన అన్నారు. నాయకుడు ముందు ఉండి నడిస్తే.. వెనుక జనం నడుస్తారు.. సరైన మార్గంలో వారిని నడిపించేవారే నిజమైన నాయకులు అన్నారాయన.. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీ విద్యార్థులు అల్లర్లకు, హింసకు పాల్పడుతున్నారని, వారిని ప్రోత్సహించేవారు నాయకులెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మొదటిసారిగా సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఇలా స్పందించారు. ఈ నెల 31 న బిపిన్ రావత్ రిటైర్ కానున్నారు. అయితే ఆయన ప్రసంగం రాజకీయంగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యానికి విరుధ్దమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజకీయ సమస్యలపై ఒక సైనికాధికారిని మాట్లాడేందుకు అనుమతిస్తే.. సైన్యాన్ని హస్తగతం చేసుకునేందుకు కూడా అనుమతిస్తారా అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ట్వీట్ చేశారు. అయితే కొంతమంది మాత్రం బిపిన్ వ్యాఖ్యలను సమర్థించారు. ఈ దేశ పౌరునిగా మాట్లాడే హక్కు ఆయనకు ఉందన్నారు.