కర్నాటకలో నాయకత్వ మార్పు తథ్యమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ..వివాదాస్పద ఆడియో టేప్ ఒకటి బయటపడి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర కొత్త సీఎంగా ముగ్గురి పేర్లను బీజేపీ చీఫ్ నళిని కుమార్ కతీల్ పేర్కొన్నారంటూ ఆయన గొంతుతో వెలువడిన ఈ క్లిప్ రాజకీయవర్గాల్లో అప్పుడే ప్రకంపనలు రేపుతోంది.ఇందులో సీఎం ఎడ్యూరప్ప ఇక వైదొలగుతారని, ఆయన స్థానే ముఖ్యంగా పార్టీ నేత సదానంద గౌడ పేరు వినవస్తోందని, అలాగే కేబినెట్ లో కొందరు పాతవారికి ఉద్వాసన పలకవచ్చునని కతీల్ ఓ ఎమ్మెల్యేకి చెప్పినట్టు ఈ వీడియో క్లిప్ లో ఉన్నట్టు తెలిసింది. కానీ ఆ స్వరం నాది కాదని, దీనిపై ఎంక్వయిరీ జరిపించాలని నళిని కుమార్ సీఎం ఎడ్యూరప్పకు రాసిన లేఖలో కోరారు. ఎవరో తన గొంతును అనుకరించి మాట్లాడారన్నారు. ఇటీవల ఢిల్లీలో ఎడ్యూరప్ప ప్రధాని మోదీతోను, ఇతర బీజేపీ నేతలతో కూడా భేటీ అయి వచ్చారు. ఆ నేపథ్యంలో ఇక నాయకత్వ మార్పు జరగవచ్చునన్న ఊహాగానాలకు ఇది ఆజ్యం పోస్తోంది. అయితే తన రాజీనామా ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసినప్పటికీ .. ఈ ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి.
పైగా ఈ ఆడియో టేప్ వ్యవహారంపై నళిని కుమార్ గానీ, ఆయన సహచరులు గానీ పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. ఈ నెల 26 న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది; ఆ రోజుతో ఎడ్యూరప్ప పదవి చేబట్టి రెండేళ్లు పూర్తి అవుతాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 లో జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలనీ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒక విధంగా చురుకైన , యువ నాయకత్వం అవసరమని కూడా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా పేర్కొంటున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి: OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు!
Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..