Congress Protest against Fuel Prices:పెట్రోల్ ధరలు భగభగ మండిపోతున్నాయి. చమురు కంపెనీలు ఎడాపెడా రేట్లు పెంచేస్తుండటంతో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. తగ్గేదేలే అన్నట్లు పెరిగిపోతున్నాయి. రెండు నెలలుగా పైపైకి ఎగబాకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న ఒకరోజే కాస్త గ్యాప్ ఇవ్వగా..ఇవాళ మళ్లీ పెరిగాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హండ్రెడ్ మార్క్ దాటేయ్యగా.. మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువైంది లీటర్ పెట్రోల్ రేటు. ఈ నేపథ్యంలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది కాంగ్రెస్ పార్టీ.
హైకమాండ్ పిలుపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్స్ వద్ద ఆందోళనలకు దిగారు కాంగ్రెస్ శ్రేణులు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అమృత్‌సర్‌లో వినూత్నంగా నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఎడ్లబండిపై కారును ఎక్కించి లాక్కెళ్లారు. పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలతో అదనపు భారం పడుతోంది. దీనికి తోడు పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతుండడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బైకులు, కార్లు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితొచ్చిందని వాపోతున్నారు వాహనదారులు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పెట్రోల్ ధరల దూకుడుపై కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో వినూత్న నిరసనలకు దిగింది. సామాన్యుడికి అందని స్థాయిలో పైపైకి ఎగబాకుతుండడంతో ఐసీసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా… ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో సీఎల్పీ నేతతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నా- రాస్తారోకోలు చేపట్టారు.. హన్మకొండలోని నక్కలగుట్టలో రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లో పెట్రో మంటలు – కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఎన్ఎస్‌యూఐ వినూత్నంగా నిరసన చేపట్టింది. పెట్రోల్ బంక్ ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టూ వీలర్ బైక్‌లు ఫర్ సెల్ అంటూ ప్రదర్శన పెట్టారు. తోపుడ బండ్లపై ప్రజలను తరలిస్తున్నట్టు నిరసన తెలిపారు. పెట్రోల్ ధరలు చేరుకోవడంతో.. మోదీ ఫేస్ మాస్క్‌తో క్రికెటర్ వేశదరణతో సెంచరీ కొట్టినట్లు అభివాదం చేశారు. అటు మేడ్చల్ జిల్లాలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కేంద్రంలో బంకు దగ్గర నిరసనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని జలాల్ పెట్రోల్ బంకు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెట్రో ధరలకు నిరసనగా ఆందోళనకు దిగాయి. పలు చోట్ల బైక్‌లను నెట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలంటూ… కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న తేజ పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు మార్కెట్ సెంటర్‌లో పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు దిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయిల్ ధరలు నియంత్రణ చేయలేని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.
Read Also…. ED Raids on MP Nama: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. రుణాల పేరుతో బ్యాంకుల మోసం కేసులో..