కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, కేరళలో రెండు వర్గాలు తప్ప అసలు పార్టీయే లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ హైకమాండ్ ను కూడా ఆయన విమర్శించారు. పార్టీకి రాజీనామా చేయాలని తాను కొన్నిరోజులుగా అనుకుంటున్నానని చెప్పిన ఆయన, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపానని తెలిపారు. ఏప్రిల్ 6 న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో చాకో రాజీనామా పార్టీకి పెద్ద దెబ్బే. రాష్ట్రంలో రెండు పార్టీలు..కాంగ్రెస్(ఐ), కాంగ్రెస్ (ఎ) ఉన్నాయని, కేరళ కాంగ్రెస్ యూనిట్ గా పని చేసే రెండు పార్టీల సమన్వయ కమిటీ అదని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రావలసి ఉందని, కానీ పార్టీలో ముఠాతత్వం పెరిగిపోయిందని, ఇది అంతం కావాలని తాను కోరుతున్నా.. పార్టీ అధిష్ఠానం కూడా ఈ రెండు గ్రూపుల మాటలు వింటోందని చాకో ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా ఆయన సోనియా లేదా రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించలేదు.కేరళ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వ సూచనలను పట్టించుకోవడంలేదని, అసలు పార్టీలో ప్రజాస్వామ్యమన్నది లేదని ఆయన అన్నారు.
అభ్యర్థుల జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని, వారి విజయావకాశాలు తదితరాలపై చర్చలే జరగలేదని చాకో పేర్కొన్నారు. త్రిసూర్ మాజీ ఎంపీ అయిన ఆయన.. పార్టీని ఇంతగా దుయ్యబట్టడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఏ) పేరిట ఓట్లను ఎలా లెక్కించగలుగుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీవాదిగా ఉండడం చాలా కష్టమని, ఏదో ఒక వర్గానికి చెందితేనే మనుగడ ఉంటుందని ఆయన సెటైర్ వేశారు. పార్టీ నాయకత్వం చురుకుగా లేదన్నారు. గాంధీల కుటుంబానికి సన్నిహితులైనవారిలో చాకో కూడా ఒకరు. లోగడ సోనియాకు లేఖ రాసిన 23 మంది అసమ్మతి నేతలను ఆయన ‘జీ-23’ గా అభివర్ణించారు. బహుశా రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారే ఈ లేఖ రాసి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ‘పురుగు’….హిమాలయన్ వయాగ్రాగా పిలిచే దీని ధర ఎంతో తెలుసా..!
Hyderabad: రూ. 5 కాయిన్‌కు 5 లక్షలు రూపాయలు.. అసలు ఎం జరిగిందంటే…