Farmers Protest: కాంగ్రెస్ నేతల ధర్నాకు కారణం అదే.. రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్..

|

Dec 27, 2020 | 5:25 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా..

Farmers Protest: కాంగ్రెస్ నేతల ధర్నాకు కారణం అదే.. రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్..
Follow us on

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాను తప్పుపట్టారు. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ చట్టాలను పొందుపర్చిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. అయితే వాటిని కాంగ్రెస్ అమలు చేయకుండా నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారన్న అక్కసుతోనే ఆ పార్టీ నేతలు ఆందోళనలకు దిగారని ఆమె విమర్శించారు.

‘నేను రాహుల్ గాంధీని అడగదలుచుకున్నాను. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ చట్టాలకు సంబంధించిన హామీని పొందుపరిచారా? లేదా?. ఈ వ్యవసాయ చట్టాలను వారు అమలు చేయకుండా మోదీ చేస్తున్నారనే అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు నేడు ఆందోళనలు చేపడుతున్నారు’ అని సీతారామన్ మీడియాతో వ్యాఖ్యానించారు.

అదేవిధంగా.. వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని భావిస్తున్నానంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే కేంద్రంతో ఐదు దఫాలుగా చర్చలు జరిగాయి. మళ్లీ తాజాగా చర్చలకు కేంద్ర ప్రభుత్వం రైతులను ఆహ్వానించింది. కేంద్రం ఆహ్వానానికి రైతులు కూడా ఓకే చెప్పారు. మరి తదుపరి చర్చల్లో ఏమవుతుందనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.

 

Also read:

Bigg Boss 4: బ్రేకప్ ద్వారా లైఫ్‏లో చాలా నేర్చుకున్నా.. తను నేను మంచి స్నేహితులం మాత్రమే.. టీవీ9తో అరియానా..

Cow Birthday Celebration : గోమాతకు జన‌్మదిన వేడుకలు..ఈ రైతును అభినందించకుండా ఉండగలరా..?