Congress Party: కాంగ్రెస్ నోట మళ్ళీ పాతమాటే.. పార్టీ ముందు రెండు సవాళ్ళు.. ముందే తేల్చకపోతే సంక్లిష్టమే..!

|

Feb 28, 2023 | 7:27 PM

సరిగ్గా ఐదేళ్ళ క్రితం వినిపించిన రాగాన్నే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆలపిస్తోంది. అయితే, ఈసారి రెండు అంశాలు ఆ పార్టీకి జఠిలంగా మారే పరిస్థతి వుంది. ఆ రెండంశాలను తేల్చకుంటే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళతాయి. తేలిస్తే విపక్షాల జట్టుకు విఘాతం.

Congress Party: కాంగ్రెస్ నోట మళ్ళీ పాతమాటే.. పార్టీ ముందు రెండు సవాళ్ళు.. ముందే తేల్చకపోతే సంక్లిష్టమే..!
Congress Raipur Plenary
Follow us on

సరిగ్గా ఐదేళ్ళ క్రితం వినిపించిన రాగాన్నే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆలపిస్తోంది. 2018లో ప్రతిపక్ష పార్టీల ఐక్యత ద్వారానే బీజేపీని ఓటమి పాలు చేయవచ్చని, అందుకు లైక్ మైండెడ్ పార్టీలన్నీ కలిసి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లీనరీ వేదిక నుంచి పిలుపునిచ్చింది. ఆనాటి ఉత్సాహం చూస్తే బీజేపీని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ కూటమి ఓడించగలదన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా బీజేపీని సొంతంగా 300 సీట్లు దాటేలా చేసింది. నివురుగప్పిన నిప్పులా వున్న మోదీ చరిష్మా 2019 ఎన్నికలను ప్రభావితం చేసేసింది. 2018 ప్లీనరీలోను తాము అధికారంలోకి వస్తే చేసే, చేపట్టే కొన్ని కార్యక్రమాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ ఓటమే లక్ష్యంగా వ్యూహరచన చేసింది. తాజాగా చత్తీస్‌గఢ్ (తాము అధికారంలో వున్న రాష్ట్రంలో పార్టీ ప్లీనరీని నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా వస్తోంది) రాజధాని రాయ్‌పూర్ సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్లీనరీలోను మోదీని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహరచన చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కాకపోతే ఒక్క మార్పు మాత్రం వుంది. 2018లో గాంధీ కుటుంబీకుల సారథ్యంలో వున్న కాంగ్రెస్ పార్టీ.. తాజా ప్లీనరీలో మల్లికార్జున ఖర్గే సారథ్యంలోకి మారింది. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మాత్రమే లక్ష్యంగా కాకుండా మోదీ నుంచి పీఎం సీటును తప్పించడం లక్ష్యంగా సాగింది. అందుకోసం మోదీని వ్యతిరేకించే ఏ పార్టీతో అయినా కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే తాము సింగిల్‌గా బీజేపీని, మరీ ముఖ్యంగా మోదీని ఓడించలేమని కాంగ్రెస్ అధిష్టానం పరోక్షంగా అంగీకరించేసింది కూడా. 50కి కాస్త అటూ ఇటూగా వున్న లోక్‌సభ సభ్యుల సంఖ్యను అమాంతం 272 దాటేలా చేసుకోలేమన్న కఠోర సత్యాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. అందుకే విపక్షాల ఐక్యతా రాగాన్ని మరోసారి అందుకున్నారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కోచ్చి పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండంశాల్లో క్లారిటీ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అన్నదిపుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

బీజేపీ తరపున మూడోసారి కూడా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీనే ముందుంచబోతున్నారు. ఇప్పటి దాకా అలాంటి నిర్దిష్ట ప్రకటనేది వెలువడకపోయినా.. 2024 ఎన్నికలకు కూడా నమో ఇమేజీతోనే బీజేపీ వెళ్ళబోతోంది. కానీ ప్రధాని అభ్యర్థి విషయమే ఇపుడు విపక్షాల ఐక్యతకు శరఘాతంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అయినా… దాన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును గనక ప్రకటిస్తే కలిసి వచ్చే పార్టీలు కూడా మొహం చాటేసే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎవరికి వారు తామే పీఎం క్యాండిడేట్ అనుకునే చిన్నా చితకా పార్టీలు కూడా దేశంలో వున్నాయి. ఉదాహరణకు బీహార్ దాటితే ఎవరికీ పెద్దగా తెలియని నితీశ్ కుమార్ కూడా పీఎం కావాలన్న కలల్లో వున్నారు. ఆ లక్ష్యం వల్లే ఆయన బీజేపీకి దూరమయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక బెంగాల్ టైగ్రెస్ మమతా బెనర్జీ కూడా సీఎం టు పీఎం అన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. యుపీఏలో కాంగ్రెస్ పార్టీ తర్వాత కీలక పార్టీ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవర్‌కు కూడా పీఎం కావాలని వున్నా దానిని బహిరంగంగా వ్యక్తపరిచి సోనియాగాంధీకి ఆగ్రహం తెప్పించలేక మిన్నకుండి పోయారు. గత ఏడాది రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీల తరపున ప్రెసిడెంటు క్యాండిడేట్‌గా వుండమంటే శరద్ పవర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ప్రధాని కావాలన్న కోరిక వల్లే ఆయన ప్రెసిడెంటు పదవిని వద్దనుకున్నారన్న సంగతి ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్నవారికైనా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పీఎం కావాలనుకోవడం వల్లనే టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేసీఆర్ గానీ, పార్టీ గానీ ఏనాడు డైరెక్టు ప్రకటన చేయనప్పటికీ.. తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో అమలు చేసే కార్యక్రమాలను కేసీఆర్ తరచూ చెబుతున్నారు. ఉదాహరణకు ఉచిత విద్యుత్ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తానని, రైతు సంక్షేమ రాజ్యంగా తమ సారథ్యంలోకి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని, జాతీయ ఇరిగేషన్ పాలసీకి పెద్ద పీట వేస్తామని కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభల్లో ప్రకటనలు చేస్తుండడం చూస్తే ఆయనకు కూడా ప్రధాని కావాలన్న లక్ష్యం వుందనిపించక మానదు.

ఇలా పలు చిన్నా, చితకా పార్టీల అధినేతలు కూడా పీఎం కావాలని కోరుకుంటున్న తరుణంలో వారందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తమ పీఎం క్యాండిడేటును ప్రకటించే సాహసం చేయదన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని వ్యూహాత్మకం అని కొందరు కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటుంటే.. మరికొందరు మాత్రం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించ లేకపోవడం దుస్థితేనని వాపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకిదో సందిగ్ధావస్థేనని చెప్పాలి. ప్రస్తుతం యుపీఏలో వున్న పార్టీల్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎవరు కాదనరు. ఎన్సీపీ అధినేతకు భిన్నాభిప్రాయం వున్నా కూడా ఆయన బయటపడరు. కానీ ప్రస్తుతమున్న యుపీఏ స్వరూపంతో బీజేపీని ఎదుర్కోవడం, కమలనాథులను గద్దెదింపడం సాధ్యం కాదనే చెప్పాలి. బహుశా ఈ అంశాన్ని గుర్తించడం వల్లనే మరికొన్ని విపక్ష పార్టీలను కలుపుకుని యుపీఏని బలోపేతం చేయాలని ఇటీవల ముగిసిన ప్లీనరీలో తీర్మానించారు. ఈ సందిగ్ధ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటనతో విపక్షాలు తమ వెంట నడుస్తాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. కానీ అది కూడా పీఎం క్యాండిడేట్ ప్రకటన లాంటి ట్రికీ సిచ్యుయేషన్‌నే ఆ పార్టీకి క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు కూటమి కట్టే విపక్షాలకు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తుందన్నది కాంగ్రెస్ ప్లీనరీ ప్రకటన. ఈ ప్రకటనతో జట్టు కట్టే విపక్షాలు బీజేపీని గద్దె దింపగలిగితే రాహుల్ గాంధీని సులభంగా పీఎం చేయవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల వ్యూహం. కానీ, ప్రస్తుతమున్న యుపీఏ పక్షాలు కాకుండా ఇతరత్రా చెప్పుకోదగిన పార్టీల్లో చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద పనిచేసేందుకు ముందుకు రావు. తృణమూల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి కాంగ్రెస్ ఛత్రం కిందకు చేరితే వారివారి రాష్ట్రాల్లో తలెత్తే ఇబ్బందుల కారణంగా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసేందుకు సిద్దం కావు. అదేసమయంలో ఆర్జేడీ, జెడీయు వంటి పార్టీలు ప్రధాని క్యాండిడేట్ ప్రకటన చేయకపోతే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పనిచేసేందుకు సిద్దపడతాయి.

జట్టు కట్టే విపక్షాలు ఏ పార్టీ సారథ్యంలో పని చేయాలి ? ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి ? అన్న రెండు కీలకాంశాలే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాల ఐక్యతలో కీలకం కాబోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత సున్నితమైన ఈ రెండంశాలు విపక్షాల కూటమి ఏర్పాటును జఠిలం చేస్తాయి. ప్రతిపక్ష పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా మార్చాలంటే కాంగ్రెస్ పార్టీకి త్యాగాలు చేయాల్సిన పరిస్థితిని కల్పించకమానదు. ఆ త్యాగాలలో ఒకటి కూటమి సారథ్య బాధ్యతలైతే, రెండోది ప్రధాని అభ్యర్థిత్వంపై నోరు మెదపకపోవడం. ఈ రెండు అంశాలపై రాజీపడితే అది పరోక్షంగా కాంగ్రెస్ బలహీన స్థితిని బహిర్గతం చేయకమానదు. తాను బలహీనంగా వుండడం వల్లే కీలకాంశాలపై స్పష్టమైన ప్రకటన చేయలేకపోయిందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళతాయి. అలాంటి బలహీనమైన పార్టీకి దేశ సారథ్య బాధ్యతలను కట్టబెడితే అది అంతిమంగా బలహీన ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుందన్న అంశాన్ని సగటు ఓటరు గ్రహించక మానడు. అంతర్జాతీయంగా భారత దేశ ఖ్యాతి పెరుగుతుందనుకుంటున్న సగటు భారతీయుడు భవిష్యత్తులో కేంద్రంలో బలహీన ప్రభుత్వం రావాలని కోరుకోడు. అలాంటి పరిస్థితే వస్తే అది నరేంద్ర మోదీకి అనుకూలాంశంగా మారితీరుతుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పలు సర్వేలు నరేంద్ర మోదీ చరిష్మాకు ఏ విదేశీ అధినేత సరితూగలేరన్న అంశాన్ని వెల్లడిస్తున్నాయి. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ 2023 ఫిబ్రవరి 2న వెల్లడించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ సర్వేలో నరేంద్ర మోదీకి ఏకంగా 78 శాతం ఓట్లొచ్చాయి. అమెరికన్ ప్రెసిడెంటు రెండోస్థానంలో ఎక్కడో 40 శాతం దగ్గరే ఆగిపోయారు ఈ సర్వేలో. సో.. మోదీ చరిష్మాను ఎదుర్కోవడం అంత సులభం కాదన్నది ఈ సర్వేల సారాంశం. అలాంటి పరిస్థితిలో ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేని పార్టీ బీజేపీని ధీటైన పోటీనివ్వగలదా అన్నది చర్చనీయాంశమే. ప్రస్తుతానికి ప్రతికూలమైనప్పటికీ ప్రధాని అభ్యర్థిత్వం, విపక్ష కూటమికి సారథ్యం.. ఈ రెండు కీలకాంశాలపై విస్పష్టమైన ప్రకటన చేయడం ద్వారానే తాను ప్రతిపక్షాలకు పెద్దన్నగా మారతానని కాంగ్రెస్ పార్టీ ఓ స్పష్టమైన సందేశాన్ని పంపాలి. అప్పుడే కాంగ్రెస్ నేతలు ధైర్యంగా వున్నరన్న అభిప్రాయం బలంగా వెళ్ళి కొన్ని పార్టీలు దగ్గరకి వస్తాయి. మోదీకి ప్రత్యామ్నాయం రావాలనుకుంటున్న వారిలో ఓ ఆశ చిగురిస్తుంది.