Kapil Sibal Coments on Congress Party : నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన వెలువడిన వేళ కాంగ్రెస్‌లోని అసమ్మతి వర్గం మరోసారి తమ గళం విప్పింది. పార్టీ బలహీనపడుతోందని, బలోపేతం చేయాల్సి అవసరం వచ్చిందని మళ్లీ గుర్తుచేసింది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, ఎంపీలు వివేక్ తంఖా, మనీశ్ తివారీ, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జి 23 బృందంలో వీరు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ బలహీనపడుతోంది. అందుకే మేమంతా మళ్లీ కలిశాం. పార్టీని మెరుగుపర్చేందుకే మేం గళమెత్తుతున్నాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త తరాలు వెలుగులోకి రావాలి. కాంగ్రెస్‌కు మంచిరోజులు చూశాం. అలాంటి పార్టీ పడిపోవడం మేం చూడలేం’’ అని పార్టీ అధినాయకత్వానికి సూచనలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం, వ్యవస్థాగత నిర్మాణంలో మార్పులు అవసరమంటూ గతేడాది ఆగస్టులో సిబల్, ఆజాద్‌తో పాటు 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరపాలని వారు కోరారు. ఈ అసమ్మతి నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గతంలో సమావేశమైనప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదు. ఇదిలా ఉండగా.. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నేతలు సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే..
తెలంగాణ కాంగ్రెస్‌ను సోషల్ మీడియా వ్యవహారం కుదిపేస్తుంది. మొన్న మాజీ మంత్రి జానారెడ్డి, నేడు మాజీ ఎంపీ వీహెచ్ ఇలా కాంగ్రెస్ సీనియర్ నేతలు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో కామెంట్లపై చాలా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదని… మీడియా ముందు అరగంటసేపు నేతలకు క్లాస్ తీసుకున్నారు. అభిమానులు, అనుచరులు కామెంట్లు చేసినా… వారిపై యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత నేతలపైనే ఉందన్నారు. లేదంటే ఇది పార్టీకే నష్టమని వార్నింగ్ ఇచ్చారు జానారెడ్డి.
మాజీ మంత్రి జానారెడ్డిని సమర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై జానారెడ్డి స్పందించడం శుభపరిణామం అన్నారు వీహెచ్. చాలా రోజుల నుండి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నారని, TPCCకి చాలా సార్లు పిర్యాదు చేసామన్నారు వీహెచ్. అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటే కావాలనే ఇంకో మీటింగ్ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా హైకమాండ్ ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదన్నారు.