Congress Chintan Shibiram: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిరం తొలిరోజు ఉత్సాహంగా జరిగింది. ఈ శిబిరం వేదిక పైనుంచి మోదీ సర్కారుపై పదునైన విమర్శలు సంధించారు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ. మోదీ తరుచూ చెప్పే కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన నినాదానికి అర్థం ప్రజల్లో చీలిక తేవడమేనని ఆరోపించారు ఆమె.
ప్రధాని మోదీ, ఆయన సహచరులు తరచూ వల్లించే ‘మాగ్జిమం గవర్నెన్స్, మినిమమ్ గవర్నమెంట్’ నినాదానికి నిర్వచనం చెప్పారు సోనియా. దాని అసలు అర్థం ప్రజల్లో చీలిక తేవడం, మైనారిటీలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనన్నారు. దేశాన్ని శాశ్వతంగా చీలిక స్థితిలో ఉంచడం, ప్రజలు భయం, అభద్రతలో భయం బతికేలా చేయడమే దాని అర్థమని చెప్పారు. నెహ్రూ వంటి నాయకుల త్యాగాలను చరిత్రలో చెరిపేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహాత్మాగాంధీ హంతకులను, వారి సిద్ధాంతాలను కీర్తిస్తోందన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు 400 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు చింతన్ శిబిరానికి హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 2024 లో పార్లమెంటు ఎన్నికల వ్యూహాలతో పాటు సంస్థాగత సంస్కరణలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది కాంగ్రెస్. పార్టీలో మార్పులు ప్రస్తుత అవసరమని, మన పనితీరు కూడా మారాలని నాయకులకు చెప్పారు సోనియా. నాయకులకు పార్టీ చాలా ఇచ్చిందని, ఇది మనమంతా తిరిగి పార్టీకి తిరిగి ఇవ్వాల్సిన సమయమని అన్నారు.
చింతన్ శిబిరానికి ఢిల్లీ నుంచి రైలులో వచ్చారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ రెండు బోగీలను బుక్ చేసింది. చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, జయరాం రమేష్ తదితర నాయకులు రాహుల్‌తో పాటు రైలులో ప్రయాణించారు. మాస్‌తో కనెక్ట్ అయ్యేందుకు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు రాహుల్. అలాగే నాయకులతో కలిసి బస్‌లో ప్రయాణించారు. చింతన్ శిబిరంలో గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ వేదికగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది కాంగ్రెస్. ముఖ్యంగా ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధనపై పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ చెప్పారు.
పార్టీలో అన్ని స్థాయిల్లో పదవులకు, ఎన్నికల్లో పోటీకి నాయకులకు ఏజ్ లిమిట్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ రాజ్యసభ సభ్యులకు టెర్మ్ లిమిట్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌కు యంగ్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ అంశాలపై చింతన్ శిబిర్‌లో ఈ నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది.