బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్)సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటీవల బెస్ట్ సంస్థ ఉద్యోగుల పర్సు బరువు విపరీతంగా పెరిగింది. అంటే వారికి శాలరీలు పెరిగాయని కాదు. జీతాలే చిల్లర రూపంలో ఇస్తున్నారట. ఈ సంస్థ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా చిల్లర రూపంలో జీతాలు పొందుతున్నారు. కొన్ని నెలల కిందటి వరకు ఈ సంస్థ ఉద్యోగులకు వారి బ్యాంకు అకౌంట్లలోనే జీతాలు పడేవి. కానీ ఇప్పుడు వారి వేతనాలను చిల్లర రూపంలో డైరెక్ట్‌గా చేతికి అందిస్తున్నారు.
అయితే ఈ విచిత్ర పరిస్థితికి అసలు కారణమేంటంటే.. బెస్ట్ సంస్థకు వచ్చిన చిల్లరను తీసుకోవడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించడమేనని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ఈ సంస్థలో 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెస్ట్ సంస్థ దాదాపు 4 వేల బస్సులను నడపడమే కాకుండా.. 10 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాను అందిస్తోంది. ప్రయాణికుల టికెట్లు, విద్యుత్తు వినియోగదారులు చెల్లించే బిల్లుల్లో చిల్లర డబ్బులు ఎక్కువగా ఉంటోంది. బ్యాంకులు ఆ చిల్లరను తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో చేసేది లేక తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంగా చిల్లర నాణేలు ఇవ్వాలని బెస్ట్ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది.
కాగా, వచ్చే జీతంలో సగం మొత్తం చిల్లర రూపంలో వస్తున్న కారణంగా.. ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని బెస్ట్ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే జీతాలు ఇచ్చినప్పుడల్లా నాణాల సంచీ చేతిలో పట్టుకొని ఇళ్లకు వెళ్లడం సురక్షితం కాదని ఉద్యోగులు అంటున్నారు. అయితే చిల్లరను డిపాజిట్ చేసేందుకు జనవరిలో ఓ ప్రైవేట్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నప్పటికీ..పలు కారణాలతో అది కార్యరూపం దాల్చడం లేదని అధికారులు తెలిపారు. జీతాన్ని నాణేల రూపంలో ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ‘బెస్ట్’ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
జల్లికట్టులో అపశ్రుతి.. కానిస్టేబుల్ ను కొమ్ములతో కుమ్మిన ఎద్దు.. పరిస్థితి విషమం
Friends: స్నేహితులుగా మారిన బద్ద శత్రువులు.. వైరల్ గా మారిన వీడియో