Power Crisis: తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ముంచుకొస్తున్న విద్యుత్ కష్టాలు.. ప్రణాళిక కొరవడిందా.. పాలకుల నిర్లక్ష్యమా!

|

May 03, 2022 | 10:05 AM

దేశంలో విద్యుత్తు డిమాండు పెరిగే కొద్దీ బొగ్గు కొరత అధికమవుతోంది. దాని మూలంగా నిరుడు విద్యుదుత్పత్తి 36 శాతం తగ్గింది.

Power Crisis: తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ముంచుకొస్తున్న విద్యుత్ కష్టాలు.. ప్రణాళిక కొరవడిందా.. పాలకుల నిర్లక్ష్యమా!
Power Cuts
Follow us on

Coal shortage in India: దేశంలో విద్యుత్తు డిమాండు పెరిగే కొద్దీ బొగ్గు కొరత అధికమవుతోంది. దాని మూలంగా నిరుడు విద్యుదుత్పత్తి 36 శాతం తగ్గింది. గత అక్టోబరులో డిమాండుకు, సరఫరాకు మధ్య 8.20 కోట్ల యూనిట్ల అంతరం ఏర్పడగా, గత నెల 25న 6.88 కోట్ల యూనిట్లు తరుగుపడ్డాయి. దాంతో పలు రాష్ట్రాల్లో కోతలు తప్పడం లేదు. ముందుచూపు లేని పాలకుల పోకడలతో ఏపీలో పరిస్థితి అధ్వానంగా ఉంది. దేశంలో మొత్తం 3.95 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విద్యుత్కేంద్రాలున్నాయి. అదే సమయంలో ఒక రోజుకు గరిష్ఠ విద్యుత్‌ డిమాండు రెండు లక్షల మెగావాట్లలోపే ఉంది. ఆ మాత్రం కూడా సక్రమంగా ఉత్పత్తి చేసి సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతుండటంతో ప్రజలకు సమస్యలు తప్పడం లేదు.

దేశీయంగా 2.04 లక్షల స్థాపిత సామర్థ్యం కలిగిన విద్యుత్కేంద్రాలకు బొగ్గే ఆధారం. దాని సరఫరా సరిగ్గా లేక దేశవ్యాప్తంగా యాభైకిపైగా కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు కేంద్ర విద్యుత్తు మండలి తాజా నివేదిక చెబుతోంది. థర్మల్‌ విద్యుత్కేంద్రంలో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి కావాలంటే కనీసం 14 నుంచి 26 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి. కానీ పలు కేంద్రాల్లో కనీసం నాలుగైదు రోజులకు మించి బొగ్గు నిల్వలు కొరవడుతున్నాయి. విద్యుత్‌ డిమాండుకు తగినట్లుగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి లేక దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలు ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర నాణ్యతను బట్టి టన్నుకు రెండు వేల నుంచి పదివేల రూపాయల వరకు పలుకుతోంది. విదేశీ బొగ్గు గనుల కంపెనీలు మాత్రం గడచిన మూడేళ్లలో ధరలను టన్నుకు ఏడు వేల రూపాయల నుంచి రూ.30 వేల వరకు పెంచేశాయి.

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో అంతర్జాతీయ విపణిలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా యూనిట్‌ కరెంటు ఉత్పత్తి వ్యయం ఏడాది క్రితంతో పోలిస్తే మూడు రూపాయలు అధికమైంది. జాతీయ ఇంధన ఎక్స్ఛేంజీలో యూనిట్‌ కరెంటును రూ.12కి కొనలేక పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మార్చి నెల మొత్తానికి 57.40 కోట్ల యూనిట్ల కరెంటు కొరత ఏర్పడింది. ఈ లోటు పూడ్చలేక గంటలకొద్దీ కరెంటు సరఫరా నిలిపివేశారు. విదేశీ బొగ్గుపై ఆధారపడిన పది విద్యుత్కేంద్రాలు ఇటీవల మూతపడ్డాయి. గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 11 నెలల్లో దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో 10.53 లక్షల మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని పూర్తిస్థాయిలో సాధించలేకపోవడానికి బొగ్గు కొరతే ప్రధానకారణం. గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తమ్మీద 13.75 లక్షల ఎంయూల కరెంటు అవసరమైతే- అంతకన్నా 5845 ఎంయూలు తక్కువగా సరఫరా చేశారు. దాంతో అనేక గ్రామాల్లో కరెంటు కోతలు తప్పలేదు. గతేడాదిలో దేశం మొత్తం కలిపి 13.69 లక్షల ఎంయూల కరెంటు వినియోగమైతే అందులో సగానికిపైగా అంటే 7.11 లక్షల ఎంయూలు కేవలం ఏడు రాష్ట్రాల్లోనే వాడుకున్నారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పూర్తి సరఫరా ఎలా సాధ్యమనేది ఆలోచించాలి.

దేశంలో అన్ని గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పించిన ఘనత తమదేనని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చాటుకుంటోంది. ఎన్ని గ్రామాలకు రోజంతా కరెంటు సరఫరా అవుతోంది… ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో ఎన్నేసి గంటలు కరెంటు కోతలు విధిస్తున్నారనే వివరాలను ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణలో పంటల సాగుకు రైతులకు కోతల్లేని కరెంటు అందుతుంటే- ఏపీలో ఏడు గంటలైనా సేద్యానికి సక్రమంగా సరఫరా కావడం లేదు. తలసరి విద్యుత్‌ వినియోగంలో జాతీయ సగటుకన్నా తెలంగాణ ముందుంటే- ఏపీ వెలవెలబోతోంది. భౌగోళికంగా, జనాభాపరంగా తెలంగాణ కన్నా పెద్దదైన ఏపీలో కరెంటు వినియోగం తక్కువ ఉండటానికి అక్కడి ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతలే ప్రధానకారణం. బొగ్గు నిల్వలు ముందస్తుగా పెంచుకోని జగన్‌ సర్కారు- విద్యుత్‌ డిమాండును అంచనా వేసి కొనుగోలు, సరఫరాల్లో చురుగ్గా వ్యవహరించడంలో చేతులెత్తేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం సరికాదు. విద్యుత్కేంద్రాల ఏర్పాటు, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాల నిర్దేశంలో శ్రద్ధ చూపుతున్న కేంద్రం- దేశమంతా నిరంతర కరెంటు సరఫరా బాధ్యతలను పూర్తిగా రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు.

విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిస్తే నిరంతర కరెంటు సరఫరా కష్టమేమీ కాదు. దేశంలో ఇప్పటికే కరెంటు కనెక్షన్‌ ఇచ్చిన 2.12 కోట్ల వ్యవసాయ పంపుసెట్లకు సౌరవిద్యుత్‌ ఫలకాలు ఏర్పాటుచేస్తే వాటికి సరఫరా చేస్తున్న సాధారణ కరెంటు ఆదా అవుతుంది. దాని ఉత్పత్తికి వినియోగించే బొగ్గు భారీగా మిగులుతుంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాలను పూర్తిగా తగ్గించి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అమెరికా, ఐరోపా, జపాన్‌ వంటి దేశాలు ప్రాధాన్యమిచ్చి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. థర్మల్‌ కేంద్రాలనే నమ్ముకుంటే- బొగ్గు కొరత మూలంగా దేశీయంగా పోనుపోను చీకట్లు ఇంకా ముమ్మరిస్తాయని అందరూ గుర్తించాలి.

విద్యుత్‌ డిమాండుకు అనుగుణంగా అదనపు విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడంలో ప్రస్తుత ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. థర్మల్‌ కేంద్రాలపై ఆధారపడితే అంధకారంలో మునిగిపోతామనే స్పృహతో అనేక దేశాల్లో సౌర, పవన విద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, జగన్‌ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టగానే పాత ఒప్పందాలను కాలదన్నారు. ఆ క్రమంలో కోర్టుతో మొట్టికాయలూ తిన్నారు. 2022కల్లా సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని లక్షా 75 వేల మెగావాట్లకు పెంచాలని ప్రధాని మోదీ పదేపదే చెబుతుంటే- దానిపై శ్రద్ధపెట్టని జగన్‌ సర్కారు, ఉన్న కేంద్రాలకూ బిల్లులు చెల్లించకుండా సతాయిస్తోంది. సొంత బొగ్గు గనులు లేనందువల్ల దేశీయ బొగ్గును వేగంగా తెప్పించే ప్రణాళికాబద్ధ చొరవనూ అది కనబరచడం లేదు. అధిక ధరలు వెచ్చించి విదేశీ బొగ్గును తెప్పించే పరిస్థితీ లేదు. ప్రజలకు నిరంతరం సరఫరా చేయాలనుకునే పాలకులకు దూరదృష్టి, విద్యుదుత్పత్తిపై భవిష్యత్తు అంచనాలు ఉండాలి. అవేమీ లేకుండా బొగ్గు కొరత పేరిట కరెంట్‌ కోతలు విధిస్తున్నారంటే అది సర్కారు చేతకానితనమే అంటున్నారు నిపుణులు.

Read Also… India Post recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతి అర్హతతో 38000 పోస్టులు..