యువతపై అనుచిత వ్యాఖ్యల తీవ్ర దుమారం.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా దేశ యువతను ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. తన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం పూర్తిగా వక్రీకరించిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పష్టతనిస్తూ ఆయన ఒక ప్రత్యేక వివరణను జారీ చేశారు.

యువతపై అనుచిత వ్యాఖ్యల తీవ్ర దుమారం.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
Cji Suryakant

Updated on: May 16, 2026 | 6:48 PM

ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా దేశ యువతను ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. తన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం పూర్తిగా వక్రీకరించిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పష్టతనిస్తూ ఆయన ఒక ప్రత్యేక వివరణను జారీ చేశారు.

తాను సాధారణంగా దేశ యువతను విమర్శించలేదని, తన మాటలను తప్పుగా అర్ధం చేసుకునేలా ప్రసారం చేశారని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. “ఒక చిన్న కేసు విచారణ సందర్భంగా మాట్లాడిన మాటలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిందని తెలిసి తీవ్రంగా బాధపడ్డాను. నకిలీ, కల్పిత డిగ్రీల సహాయంతో న్యాయవాద వృత్తులలోకి ప్రవేశించిన వారిని ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా, ఇతర ప్రతిష్టాత్మక వృత్తులలోకి కూడా చొరబడ్డారు, అందువల్ల వారు పరాన్నజీవుల వంటివారు” అని ఆయన స్పష్టం చేశారు.

తనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ, దేశ భవిష్యత్తు అయిన యువతపై తనకు ఎంతో నమ్మకం, గౌరవం ఉన్నాయని సీజేఐ అన్నారు. “నేను మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారమైనది. మన ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరుల పట్ల గర్వపడటమే కాకుండా, భారతదేశంలోని ప్రతి యువకుడు నాకు స్ఫూర్తినిస్తాడు. భారత యువత పట్ల గొప్ప గౌరవం, అభిమానం ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వారిని అభివృద్ధి చెందిన భారతదేశానికి మూలస్తంభాలుగా చూస్తాను” అని సీజేఐ కొనియాడారు.

అయితే, అంతకుముందు విచారణ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కఠినమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. “కొంతమంది యువకులు బొద్దింకల లాంటివారు, వారికి ఉద్యోగం దొరకదు లేదా వృత్తిలో స్థానం సంపాదించుకోలేరు. కొందరు మీడియాగా, కొందరు సోషల్ మీడియాగా, మరికొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా, మరికొందరు ఇతర కార్యకర్తలుగా మారి, అందరిపై దాడి చేయడం ప్రారంభిస్తారు” అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, యువత, పలు ప్రజా సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీజేఐ ఇలాంటి పదజాలం వాడటం సరికాదంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే, పరిస్థితి తీవ్రతను గమనించిన సీజేఐ సూర్యకాంత్, ఆ వ్యాఖ్యలు కేవలం నకిలీ డిగ్రీలతో వ్యవస్థలను పాడు చేస్తున్న వారిని ఉద్దేశించినవే తప్ప, ప్రతిభావంతులైన దేశ యువతను కాదంటూ నేడు అధికారిక వివరణ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us