Collector Ranbir Sharma suspended: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చాడని యువకుడిని కొట్టిన కలెక్టర్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ సచివాలయానికి అటాచ్ చేసింది. ఛత్తీస్‌గఢ్లోని సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ లాక్‌డౌన్‌లో బయటకు వచ్చాడని ఓ యువకుడిని కొట్టి అతని సెల్ ఫోన్‌ను పగులగొట్టారు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన తెలుసుకున్న ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. కలెక్టర్ చేసిన పనికి ప్రభుత్వం తరఫున ఆ యువకుడికి క్షమాపణలు సైతం చెప్పారు. దీంతోపాటు ఆ యువకుడికి ఫోన్ కూడా కొని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రణ్‌బీర్ శర్మ అత్సుత్సాహం ప్రదర్శించినందుకు అతన్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై రణ్‌బీర్ శర్మ వివరణ ఇచ్చారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. కలెక్టర్ చర్యను ఐఏఎస్ అసోసియేషన్ సైతం ఖండించింది. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, అలా చేయకూడదంటూ సూచించింది.
సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ దాడిపై బాధిత యువకుడు స్పందించాడు. కోవిడ్ -19 సోకి ఆసుపత్రిలో చేరిన తన అమ్మమ్మకు ఆహారాన్ని ఇచ్చి ఇంటికి తిరిగి వస్తున్నట్లు బాధిత యువకుడు అమన్ మిట్టల్ తెలిపాడు. ఈ సమయంలో కలెక్టర్ తనను ఆపి అడిగారని.. తాను సమాధానం చెప్పానని తెలిపారు. తన అమ్మమ్మకు ఆహారం అందించి.. రక్త పరీక్ష చేయించి వస్తున్నానని చెప్పానని.. రక్త పరీక్ష రశీదును కూడా చూపించానని తెలిపాడు. అదంతా వినిపించుకోకుండా.. లాక్డౌన్ సమయంలో ఆసుపత్రిలో చేరిన వారికి ఆహారాన్ని అందించడానికి అనుమతి ఉందా? అంటూ చెంపదెబ్బ కొట్టారని మిట్టల్ చెప్పాడు. ఆపై మళ్లీ పిలిపించి తన ఫోన్‌ను పగలగొట్టారని.. కొట్టమని సిబ్బందిని ఆదేశించారని.. కేసు నమోదు చేయాలని చెప్పారని తెలిపాడు. లాకప్‌లో ఉంచుతామంటూ బెదిరించారని తెలిపాడు.
Also Read: