
ఛత్తీస్‌గఢ్ అడవుల్లోని బాసగూడ, గంగలూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని దక్షిణ-పశ్చిమ కారిడార్‌లో మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. దాంతో ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలం నుండి ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే.. భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరువర్గాల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మృతి చెందినవారిని సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన హుంగా, లక్కె , భీమే, నిహాల్ అలియాస్ రాహుల్ అనే నలుగురు మావోయిస్టులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు. హతమైన మావోయిస్టులపై మొత్తం 17 లక్షల రివార్డ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇక.. 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రంలోని మోదీ సర్కార్ శపథం చేసింది. దానిలో భాగంగానే.. స్పెషల్ ఆపరేషన్లతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దాంతో.. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య పలుమార్లు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆయా ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.