Covaxin Vaccine: ఆ వ్యాక్సిన్‌ను సరఫరాను నిలిపివేయండి.. కేంద్రాన్ని కోరిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.. కారణమేంటంటే..!

Covaxin Vaccine: భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా సరఫరాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరింది.

Covaxin Vaccine: ఆ వ్యాక్సిన్‌ను సరఫరాను నిలిపివేయండి.. కేంద్రాన్ని కోరిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.. కారణమేంటంటే..!

Updated on: Feb 12, 2021 | 1:38 PM

Covaxin Vaccine: భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా సరఫరాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరింది. మూడో దశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాక వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని కోరింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా నిలిచిన మనదేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. దేశీయ సంస్థ అయిన భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌తో పాటు.. సీరం సంస్థ-ఆస్ట్రాజెనెకా సంయుక్తగా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 7 మిలియన్లకు పైగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వాక్సిన్ ఇచ్చారు.

అయితే, భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి మూడవ దశ ప్రయోగ ఫలితాలు వెలువడాల్సి ఉంది. మూడవ దశ ట్రయల్స్‌లో 26వేల మందికి టీకా వేయగా.. దాని సమర్థతకు సంబంధించి ఫలితాలు వచ్చే నెల నాటికి బయటకు రానున్నాయి. అయితే.. చివరి దశ ఫలితాలు రాకముందే.. కొవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేపథ్యంలోనే కొవాగ్జిన్ టీకా సరఫరాపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది.

వాస్తవాని మొదటి, రెండవ దశ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా టీకా సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్, భారత ఔషధ నియంత్రణ సంస్థ ప్రకటించాయి. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొవాగ్జిన్ టీకాలను పంపిణీ చేస్తోంది. సుమారు 32 మిలియన్ల జనాభా కలిగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 5,88,000 ఆస్ట్రాజెన్‌కా టీకాలను పంపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయగా.. అంతే స్థాయిలో కొవాగ్జిన్‌ టీకాలను కూడా పంపుతామని ప్రకటించింది. అయితే, కొవాగ్జిన్ టీకా సరఫరాపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీస్ సింగ్ డియో ఆందోళన వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ టీకా వాడకంపై ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయని, మూడోదశ ట్రయల్స్ ఫలితాలు వచ్చిన తరువాత కొవాగ్జిన్‌ను పంపాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు. ఆమేరకు ఆయన లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. రెండు టీకాలు సురక్షితమైనవే అని స్పష్టం చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రాధాన్యత గల వారందరికీ రెండు టీకాలు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇదిలాఉంటే.. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరంపై భారత్ బయోటెక్ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇదే సమయంలో బ్రిజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కొవాగ్జిన్ టీకాను ఎగుమతి చేసేందుకు భారత్ బయోటెక్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదిలాఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా టీకా కొనుగోలు చేసే సామర్థ్యం లేని దేశాల కోసం భారత ప్రభుత్వం… ఇప్పటి వరకు 10 మిలియన్ల కొవాగ్జిన్ టీకాలను ఆర్డర్ చేయగా.. 21 మిలియన్ల ఆస్ట్రాజెన్‌కా టీకాలను ఆర్డర్ చేసింది.

Also read:

Elephant Steals Woman : ఓ మహిళతో ఆడుకున్న గజరాజు.. ఆ తర్వాతన ఏం జరిగిందంటే..! వైరల్‌గా మారిన వీడియో..

న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. ఆధారాలన్నింటినీ సీబీఐకి చూపుతా: ఆమంచి కృష్ణమోహన్