ప్రధాని పర్యటనపై కేంద్రం అతిగా స్పందిస్తోంది.. ఈ సాకుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది: పంజాబ్‌ సీఎం చరణజీత్ సింగ్

|

Jan 07, 2022 | 10:51 PM

ప్రధాని పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంతో రాజకీయ రగడ రాజుకుంటోంది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ముమ్మాటికీ ఇది భద్రతా వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తుంటే

ప్రధాని పర్యటనపై కేంద్రం అతిగా స్పందిస్తోంది.. ఈ సాకుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది: పంజాబ్‌ సీఎం చరణజీత్ సింగ్
Follow us on

ప్రధాని పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంతో రాజకీయ రగడ రాజుకుంటోంది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ముమ్మాటికీ ఇది భద్రతా వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా ఈ వివాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణజీత్ సింగ్ చన్నీ టీవీ9 భారత్‌ వర్ష్‌తో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవన్నారు. బీజేపీ నాయకులు కావాలనే తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరి నిమిషంలో ప్రధాని మోడీ రోడ్డుమార్గంలో వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఇది జరిగిందన్నారు. భద్రతను సాకుగా చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని సీఎం ఆరోపించారు.

ముందుగా నేనే బుల్లెట్ కు ఎదురెళతాను..

‘ప్రధానిని నేను ఎంతో గౌరవిస్తాను. అభిమానిస్తాను. ఆయనకు ఏదైనా ఆపద కలిగితే నేనే ముందు ఉంటాను. ఒకవేళ ప్రధానిపై బుల్లెట్ పేల్చితే  నేనే ముందుగా ఎదురెళతాను. త్వరలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి అవకాశం లేదు. అందుకే ప్రధాని భద్రతా లోపాన్ని సాకుగా తీసుకుంటోంది. మోఢీ పంజాబ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కేంద్రం కావాలనే ఈ ఘటనను అతిగా ప్రచారం చేస్తోంది. కేవలం రైతుల నిరసనలతోనే ప్రధాని పర్యటనకు ఆటంకం కలిగింది. ఇందుకు నేను కూడా ఎంతో చింతిస్తున్నాను. కానీ బీజేపీ నాయకులు మాత్రం జాతీయవాదం, భద్రతా ఉల్లంఘనల పేరుతో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని హెలికాప్టర్‌లో సభకు వెళ్లాలి. కానీ చివరి నిమిషంలో తమ ప్రణాళికలు మార్చుకున్నారు. ప్రధాని రోడ్డు మార్గంలో వస్తున్నారనే విషయం నిరసనకారులకు తెలియదు. వారు మోఢీ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ పర్యటనలో ప్రధాని ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదు. భద్రతా పరంగా మా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి తప్పు చేయనప్పటికీ కేంద్రం ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణం ‘

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.
‘ప్రధాని పంజాబ్‌ పర్యటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. మోడీ పంజాబ్ పర్యటనకు సంబంధించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయాణ రికార్డులను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని హర్షణీయం. ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణ జరపడం మంచి పరిణామం’ అని చరణ్‌జీత్‌ చరణజీత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. కాగా అంతకుముందు చన్నీ కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పార్టీ కార్యకర్తలు నల్లజెండాలు చేత పట్టుకుని నిరసనలకు దిగారు. కాగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కారు దిగి నిరసనకారులతో మాట్లాడారు. వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.