Travelling to Abroad link Vaccine Certificate to Passport: విదేశాలకు వెళ్లే భారతీయుల పాస్‌పోర్టులను వ్యాక్సినషన్‌తో లింక్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది.
విదేశాలకు వెళ్లే భారతీయులకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్‌ను కేంద్రం వెల్లడించింది. ఈ ప్రయాణాలు చేసే వారి కొవిన్ సర్టిఫికెట్లను సదరు వ్యక్తుల పాస్‌పోర్టులకు లింక్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.
రెండు కొవిషీల్డ్ డోసులతో పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన ఈ వ్యక్తుల ధ్రువీకరణను ఇలా పాస్‌పోర్టుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అనుసంధాన ప్రక్రియలో వ్యాక్సిన్ రకం అనే ఆప్షన్ దగ్గర కొవిషీల్డ్ అని పెడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి ఉందని స్పష్టం చేసింది. అలాగే, ఇలా విదేశీ ప్రయాణాలు చేసే వారికి తొలి డోసు, రెండో డోసు మధ్య 28 రోజుల వ్యవధి ఉన్న అనుమతించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కాగా, ఇటీవల జరిగిన జీ7 సమావేశంలో వ్యాక్సిన్ పాస్‌పోర్టును భారత్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు భారతే ఇలా పాస్‌పోర్టుకు వ్యాక్సినేషన్ లింక్ చేయాలని నిర్ణయించడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్పత్తి సంస్థల నుంచి స్వయంగా టీకాలు కొనుగోలు చేసి రాష్ర్టాలకు ఇస్తామని తెలిపారు. టీకాల కోసం రాష్ర్టాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈనెల 21ను నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జాతీనుద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాక్సినేషన్‌పై ప్రధాని మాట్లాడారు.