Model Community Kitchen Scheme: పేదవాడి ఆకలి తీర్చేందుకు కేంద్రం కొత్త పథకం.. అందుబాటులోకి మోడల్ కమ్యూనిటీ కిచెన్..!

|

Nov 24, 2021 | 8:52 PM

ఆకలితో చనిపోతున్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశవ్యాప్తంగా మోడల్ కమ్యూనిటీ కిచెన్‌ పథకానికి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది.

Model Community Kitchen Scheme: పేదవాడి ఆకలి తీర్చేందుకు కేంద్రం కొత్త పథకం.. అందుబాటులోకి మోడల్ కమ్యూనిటీ కిచెన్..!
Piyush Goyal
Follow us on

Model Community Kitchen Scheme: ఆకలితో చనిపోతున్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశవ్యాప్తంగా మోడల్ కమ్యూనిటీ కిచెన్‌ పథకానికి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో రేపు (గురువారం) కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఆహార శాఖల మంత్రుల జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ , జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో కమ్యూనిటీ కిచెన్ మరియు ఇతర అంశాలను చర్చిస్తారు.

ఇదిలావుంటే, సామాజిక వంటశాలల (Community Kitchens In India) ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం పట్ల భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటిపై ఉమ్మడి పథకం రూపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. వీలైనంత త్వరలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వారికి ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి మూడువారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని.. లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించే పనిలో పడింది.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ వ్యవస్థను నెలకొల్పి, ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధికి మించి అవసరమైన పథకాన్ని రూపొందించి, పేదలకు ఆహారాన్ని అందించడానికి చర్యలు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆకలి, పోషకాహార లోపం లాంటి సమస్యలను పరిష్కరించడానికి జాతీయ ఆహార గ్రిడ్‌ను రూపొందించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.

దీనికి స్పందించిన సుప్రీంకోర్టు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మూడు వారాల లోగా కమ్యూనిటీ కిచెన్స్ స్కీమ్‌ను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని, పథకాన్ని అమలు చేయడానికి సహకరించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విధంగా పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

ఢిల్లీలో జరగనున్న జాతీయ ఆహార శాఖల మంత్రుల సమావేశంలో మోడల్ కమ్యూనిటీ కిచెన్ పథకంతో పాటు, ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం అమలు జరుగుతున్న తీరు, రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించడం, చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానంలో కార్యకలాపాలను అనుమతించే అంశంతో పాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. అంతకుముందు, మోడల్ కమ్యూనిటీ కిచెన్ పథకం పై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి నవంబర్ 21న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు మరియు ఆహార కార్యదర్శులతో చర్చలు జరిపారు.

Read Also…  ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్‌ రెడీ !! ఈ హెల్మెట్‌ను రూపొందించిన హైదరాబాదీలు.. వీడియో