Delhi : కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేతకు వై కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ నిర్ణయం..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సంబంధాలున్నాయంటూ ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ (Kumar Vishwas) చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సంబంధాలున్నాయంటూ ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ (Kumar Vishwas) చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి లేదా ఖలిస్తాన్ ప్రధాని అవుతానంటూ అరవింద్ తనతో చెప్పారంటూ కుమార్ చెప్పిన వ్యాఖ్యలపై లోతుగా దర్యాప్తు చేపడతామంటూ కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇదే సమయంలో వేర్పాటువాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న కుమార్ భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆప్ మాజీ నేతకు వై కేటగిరీ భద్రత కల్పించింది. ఇకపై మొత్తం 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆయన భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇందులో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు కూడా ఉంటారు. వీరు నిరంతరం కుమార్ విశ్వాస్ నివాసం వద్ద షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహిస్తారు.
కుమార్ ఏమన్నారంటే..
అరవింద్ కేజ్రీవాల్‌కు ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సంబంధాలున్నాయంటూ కుమార్ విశ్వాస్ ఆరోపించారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ తనతో అన్నారని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. పంజాబ్ అంటే సీఎం కేజ్రీవాల్‌కు ఏమాత్రం అర్థం కాలేదని ఆప్ మాజీ నేత విమర్శలు గుప్పించారు . పంజాబ్ అంటే రాష్ట్రం కాదని, అదో భావన అని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి కేజ్రీవాల్ అన్ని రకాల ప్రణాళికలు వేసుకున్నారు. ఎప్పడూ ఆ ఊహల్లోనే తేలుతూ ఉంటారు. అధికారం కోసం అరవింద్ ఏమైనా చేయగలరు ’ కుమార్ విశ్వాస్ ఆరోపించారు. కాగా ఇటీవల పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు.