కేంద్రానికి రైతుల నిరసన సెగ… ఆందోళనలు విరమించి చర్చలకు రావాలంటూ విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి..

|

Nov 27, 2020 | 7:57 PM

నూతన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనల సెగ కేంద్ర ప్రభుత్వానికి తగిలింది.

కేంద్రానికి రైతుల నిరసన సెగ... ఆందోళనలు విరమించి చర్చలకు రావాలంటూ విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి..
Follow us on

నూతన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనల సెగ కేంద్ర ప్రభుత్వానికి తగిలింది. తొలుత రైతుల ఆందోళనలను నిలువరించాలని ప్రయత్నించిన ప్రభుత్వం.. ఆ తరువాత పరిస్థితి విషమించడంతో దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసుకోవడానికి స్థలాన్ని నిర్ణయిస్తూ అనుమతులు జారీచేసింది. ఇప్పుడు ఏకంగా చర్చలకు ఆహ్వానించింది. రైతులు తమ ఆందోళనలను విరమించి చర్చలకు రావాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం నాడు ప్రకటించారు. రైతుల నిరసనల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి తోమర్.. చలి కాలం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులు తమ ఆందోళనలను విరమించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్ 3వ తేదీన వ్యవసాయ చట్టాలపై సమగ్రంగా చర్చించేందుకు రైతు సంఘాలకు ఆహ్వానం పంపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీకి పిలపునిచ్చారు. అయితే ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లోనే పోలీసులు వారిని అడ్డగించారు. భారీగా తరలి వస్తున్న రైతులను అడ్డగించేందుకు బారీకేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా వాటర్ కేనాన్లను ప్రయోగించారు. లాఠీచార్జ్ కూడా చేశారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గకపోగా.. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పరిస్థితి విషమంగా మారింది. చివరికి రైతుల ఆందోళనల సెగ కేంద్ర ప్రభుత్వానికి తగలడంతో రైతులు ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గల నిరంకారీ సమాగం గ్రౌండ్స్‌లో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది.

Also Read :

టీవీ9 తో ముఖాముఖి… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్