త్వరలో కేంద్రం కొత్త పథకం.. వీరందరి అకౌంట్లోకి రూ.46 వేలు.. క్లారిటీ వచ్చేసింది ఇదిగో..

"దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. దేశంలోని పేదల అకౌంట్లో ప్రభుత్వం రూ.46 వేలు జమ చేయనుంది" అంటూ వాట్సప్‌లో ఓ మెస్సేజ్ గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

త్వరలో కేంద్రం కొత్త పథకం.. వీరందరి అకౌంట్లోకి రూ.46 వేలు.. క్లారిటీ వచ్చేసింది ఇదిగో..
Money

Updated on: Jan 07, 2026 | 10:46 AM

PIB Fact Check: ప్రభుత్వ పథకాల గురించి సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కొంతమంది కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను వైరల్ చేస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో ఏది నిజమో..? ఏది అబద్దమో? తెలుసుకోవడం నెటిజన్లకు కష్టతరంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమని నమ్మే జనం ఎక్కువమంది ఉంటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రజలకు క్లారిటీ ఇస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవి కరెక్ట్..? ఏవి ఫేక్? అనేవి జనాలకు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకం ప్రవేశపెట్టనుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

ప్రతీ వ్యక్తికి రూ.46 వేలు అవాస్తవం

దేశ ప్రజలు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, దీనిని పరిగణలోకి తీసుకుని దేశంలోని పేదలందరికీ కేంద్ర ఆర్ధికశాఖ రూ.46,715 చొప్పున ఇవ్వాలని నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ డబ్బులు మీరు అందుకోవాలంటే లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు పూర్తి చేయాలని వాట్సప్‌లో ఓ మెస్సేజ్ గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ మెస్సేజ్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) క్లారిటీ ఇచ్చింది. “ఇది పెద్ద స్కామ్. ఆర్ధికశాఖ అలాంటి పథకం ఏమీ ప్రవేశపెట్టలేదు. ఆ లింక్‌లపై ఎవ్వరూ క్లిక్ చేయవద్దు. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడకండి. జాగ్రత్తగా ఉండండి” అంటూ కేంద్రం తెలిపింది.

ఫేక్ లింకుల పట్ల జాగ్రత్త

ప్రభుత్వ పథకాలు, డబ్బులు అనగానే జనాలు వెంటనే ఆసక్తి చూపిస్తారు. ఆశతో ఆ లింక్‌లు వెంటనే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి తమ వ్యక్తిగత వివరాలు అందించే అవకాశముంది. దీంతో సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ప్రభుత్వ పథకాల పేరును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్ క్రిమినల్స్ ఇలా వినూత్న పద్దతులను అవలంభిస్తున్నారు. దీంతో ఇలాంటి నకిలీ లింక్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తెలియని మొబైల్ నెంబర్ల నుంచి ఏమైనా లింక్‌లు వస్తే జాగ్రత్త పడండి. అధికారిక సంస్థల నుంచి లింక్‌లు వస్తేనే ఓపెన్ చేయండి. ఏ లింక్‌లు పడితే ఆ లింక్‌లు క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా చోరీ అయ్యే అవకాశముంటుంది.