ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు.. కేంద్రం సంచలన నిర్ణయం..

వైద్యవిద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి మెడికల్ అండ్ డెంటల్...

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు.. కేంద్రం సంచలన నిర్ణయం..
Medical
Follow us

|

Updated on: Jul 29, 2021 | 5:00 PM

వైద్యవిద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్(యూజీ, పీజీ)లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండీవియా వెల్లడించారు. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు అందజేయనున్నారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్, డిప్లోమో విద్యార్ధులకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశానికి ఓ పరిష్కారం కల్పించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రతీ సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబీసీ, 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబీసీ, 1000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు లబ్ది కలగనుంది.

“దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. వెనుకబడిన వర్గానికి, ఈడబ్ల్యూఎస్ వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం తన మాటకు కట్టుబడి ఉంది”అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అటు ఈ నిర్ణయంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దీనిని ల్యాండ్‌మార్క్ నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం వేలాది మంది యువత మంచి అవకాశాలు పొందడంలోనూ.. అలాగే సామాజిక న్యాయానికి కొత్త ఉదాహరణ సృష్టించడంలో ఇది ఎంతో సహాయపడుతుందని ఆయన అన్నారు.

ఆల్ ఇండియా కోటా:

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కోటా(AIQ) పధకాన్ని 1986లో కేంద్రం ప్రవేశపెట్టింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా విద్యార్ధులు మెరిట్ ఆధారంగా మెడికల్ కాలేజీల్లో చదువుకునేందుకు ఈ పధకం ఉపయోగపడుతూ వస్తోంది. ఆల్ ఇండియా కోటా కింద దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలలో యూజీ సీట్లలో 15 శాతం, పీజీ సీట్లలో 50 శాతం అందుబాటులో ఉన్నాయి. 2007వ సంవత్సరం వరకు AIQ పథకంలో రిజర్వేషన్లు లేవు.

అయితే అప్పుడే సుప్రీంకోర్టు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. ఇక రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్ చట్టం 2007 నుంచి అమలులోకి వచ్చిన దగ్గర నుంచి OBCలకు 27% రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. అన్ని కేంద్ర విద్యాసంస్థలలో కూడా ఇది అమలవుతోంది. అయితే, ఈ రూల్ రాష్ట్ర వైద్య, దంత కళాశాలలోని సీట్లకు వర్తించలేదు.

దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ విద్యార్థులు.. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా సీట్ల కోసం పోటీపడటానికి ఆల్ ఇండియా కోటా పధకంలో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందగలరు. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంబీబీఎస్‌లో సుమారు 1500 మంది, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి, 2019లో రాజ్యాంగ సవరణ జరిగింది.

దీనితో అప్పటి నుంచి ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు సంవత్సరాల పాటు మెడికల్ / డెంటల్ కాలేజీలలో సీట్లను పెంచారు. అయితే ఇంతవరకు ఇది అమలులోకి రాలేదు. దీనితో OBCలకు 27% రిజర్వేషన్లతో పాటు, EWS కోసం 10% రిజర్వేషన్లను ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22 నుండి యూజీ, పీజీ మెడికల్ అండ్ డెంటల్ కోర్సుల్లో అందజేయనుంది. ఈ రిజర్వేషన్లతో ప్రతీ సంవత్సరం MBBS కోసం 550 మందికి పైగా EWS విద్యార్థులకు, PG వైద్య కోర్సులకు 1000 EWS విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.